ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డీలిమిటేషన్‌ బిల్లుకు డిఎంకె మద్దతు

22 గంటల క్రితం

DMK supports Delimitation Bill
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 12:13 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదనకు అంగీకారం

- తమిళనాడుకు 7.18 శాతం సీట్ల వాటా కొనసాగించాలన్న డిమాండ్‌

- అవసరమైన సవరణలు ప్రతిపాదించేందుకు స్టాలిన్‌ అనుమతి


చెన్నై : లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) బిల్లుకు డిఎంకె మద్దతు ప్రకటించింది. అన్ని రాష్ట్రాల్లోనూ లోక్‌సభ స్థానాలను సమానంగా 50 శాతం పెంచాలన్న ప్రతిపాదనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ ఎంపి ఎ.రాజా వెల్లడించారు. పార్టీ అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్‌ అధ్యక్షతన జరిగిన ఎంపి ల సమావేశంలో, బిల్లుకు మద్దతు తెలపాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.


లోక్‌సభలో తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.18 శాతం సీట్ల వాటా కొనసాగించాలన్నది తమ ప్రధాన డిమాండ్‌ అని రాజా తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం తమిళనాడు స్థానాల సంఖ్య 59 కు చేరే ప్రతిపాదనకు అంగీకరించినట్లు చెప్పారు. అయితే, కొన్ని విధానపరమైన అంశాలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని, వాటిపై అవసరమైన సవరణలు ప్రతిపాదించేందుకు స్టాలిన్‌ తమకు పూర్తి అధికారాలు ఇచ్చారని వివరించారు. కాంగ్రెస్‌తో కలిసి ఉన్న సమయంలో డీలిమిటేషన్‌పై అనుసరించిన వైఖరినే ఇప్పటికీ కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.


ప్రస్తుతం చేపడుతున్న జనగణనతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రధాని మోడి నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.


గతంలో డీలిమిటేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన డిఎంకె.. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యం తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 2025లో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సమావేశంలో లోక్‌సభ స్థానాల సంఖ్యపై ఉన్న స్తంభనను 2026 తర్వాత మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలని డిమాండ్‌ చేసింది. 2026 ఏప్రిల్‌లో లోక్‌సభలో డీలిమిటేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తూ ఎంపి కనిమొళి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే, అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం స్థానాలు పెంచే ప్రతిపాదనతో డిఎంకె తాజాగా బిల్లుకు మద్దతు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో వ్యతిరేకించిన పార్టీ ఇప్పుడు మద్దతు తెలపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్