ప్రకటించిన స్టాలిన్
తమ డిమాండ్లను అంగీకరించారని వెల్లడి
వ్యతిరేకించిన సిపిఎం, విసికె
చెన్నై : కేంద్ర ప్రభుత్వం సవరించిన నియోజకవర్గాల పునర్విభిజన బిల్లులకు మద్దతునివ్వాలని డిఎంకె శనివారం నిర్ణయించింది. తమిళనాడు పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని పరిరక్షించేందుకు తాము చేసిన డిమాండ్లను ఆ బిల్లులో పొందుపరిచేందుకు కేంద్రం అంగీకరించినందువల్లనే తాము మద్దతివ్వాలని నిర్ణయించామని తెలిపింది. పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివలయంలో స్టాలిన్ అధ్యక్షతన పార్టీ పార్లమెంట్ సభ్యుల సమావేశం జరిగింది. రాజ్యాంగ సవరణ (132వ సవరణ) బిల్లు, పునర్విభజన (రెండవ) బిల్లు, 2026లకు మద్దతునిస్తూ ఆ సమావేశంలో డిఎంకె ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్రం సవరించిన ప్రతిపాదన ప్రకారం లోక్‌సభలో అన్ని రాష్ట్రాల సీట్ల సంఖ్య ఒకే రీతిన 50శాతం పెరుగుతుంది. 2051వరకు వారి ప్రస్తుత సాపేక్ష ప్రాతినిధ్య వాటాను అలాగే కొనసాగించాల్సి వుంది. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్టాలిన్ సోషల్ మీడియా ద్వారా వివరించారు. పునర్విభజనను డిఎంకె ఎన్నడూ వ్యతిరేకించలేదని, కానీ రాష్ట్రాలకు వారి హక్కుగా దక్కాల్సిన ప్రాతినిధ్య వాటాను కోల్పోయే ఏ ప్రక్రియనైనా తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెబుతూ వచ్చిందన్నారు. ‘‘అప్పుడు,ఇప్పుడు, ఎల్లప్పుడూ న్యాయమైన పునర్విభజన’’ అన్నదే తమ నినాదమని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం తమిళనాడు వాటా 7.18శాతం తగ్గదని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బిల్లు తీసుకువచ్చినపుడు తాము చేసిన డిమాండ్లను సవరించిన బిల్లులో పొందుపరిచారని తెలిపారు.
లోక్‌సభలో తమిళనాడుకు ప్రస్తుతం గల 7.18శాతం వాటాను తగ్గించరాదని, అలాగే 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్రాల మధ్య వున్న ప్రాతినిధ్య నిష్పత్తిని మరో 25ఏళ్ళ పాటు అలాగే కొనసాగించాలన్నది తమ పార్టీ కీలక డిమాండ్లని స్పష్టం చేసింది.
డిఎంకె ఎంపి ఎ.రాజా మాట్లాడుతూ, ప్రతిపాదిత పెంపు వల్ల లోక్‌సభలో తమిళనాడు వాటా 7.18శాతం నుండి 7.21శాతానికి పెరుగుతుందన్నారు. పార్లమెంటరీ కార్యకలాపాల సమయంలో అవసరమైన సవరణలు, ఇతర ఆందోళనలను పార్టీ లేవనెత్తుతుందని చెప్పారు.
కాగా విసికె నేత, చిదంబరం ఎంపి తాల్ తిరుమవలవన్ ఈ నిర్ణయాన్ని చారిత్రక తప్పిదంగా అభివర్ణించారు. కోయంబత్తూరులో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గాల పునర్విభజన వల్ల సమాఖ్యవాదం బలహీనపడుతుందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందన్నారు.
సిపిఎం కూడా ఈ నిర్ణయం పట్ల తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.షణ్ముగం మాట్లాడుతూ, తమిళనాడు, ఇతర దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడడంలో ధృఢంగా వ్యవహరించాల్సిందిగా డిఎంకెను కోరారు. బహిరంగంగా తమ వైఖరి స్పష్టం చేయాలన్నారు.
ఈ బిల్లులు సమస్యను కేవలం 2051వరకు వాయిదా వేస్తాయని, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పున:పంపిణీ వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రభావాలను పరిష్కరించకుండా అలాగే వదిలివేస్తాయని విమర్శకులు వాదిస్తున్నారు. పునర్విభజన కమిషన్ అధికారాల పట్ల కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.








కామెంట్‌లు (0)