భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక
న్యూఢిల్లీ: రష్యా సాయుధ బలగాల్లో భారతీయులను చేర్చుకున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయని భారత విదేశాంగ శాఖ (ఎంఇఎ) తెలిపింది. రష్యాకు వెళ్లే భారతీయుల కోసం ఈ మేరకు ఎంఇఎ బుధవారం అడ్వైజరీ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల్లో ఉన్న ముప్పులు, ప్రమాదాల గురించి గత రెండేళ్లలో ప్రభుత్వం అనేక సందర్భాల్లో నొక్కి చెప్పిందని విదేశాంగ శాఖ గుర్తుచేసింది. విదేశాల్లో ఉద్యోగావకాశాలను వెతుక్కునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ధృవీకరించని వ్యక్తులు ఇచ్చే ఉద్యోగ ఆఫర్లకు ఆకర్షితులు కావద్దని భారతీయ పౌరులకు ఎప్పటికప్పుడు సూచించామని తెలిపింది. కొందరు వ్యక్తులు స్వచ్ఛందంగానే రష్యా సైన్యంలో చేరేందుకు ఆఫర్లు వెతుకుతున్న ఉదంతాలు కూడా తమ దృష్టికి వచ్చాయని విదేశాంగ శాఖ పేర్కొంది. దీంతో ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చని, ఆ తర్వాత భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించి విడుదల పొందవచ్చని వారు భావిస్తున్నారని తెలిపింది. ఇది ప్రమాదకరమైందని, దీనిపై ప్రభుత్వం గట్టిగా హెచ్చరిస్తుందని విదేశాంగ శాఖ మరోసారి స్పష్టం చేసింది.








కామెంట్‌లు (0)