శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సిజెపి, సోనమ్‌లకు డివైఎఫ్‌ఐ సంఘీభావం

1 గంట క్రితం

cjp protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 10:24 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

పార్ల‌మెంట్‌లో లేవ‌నెత్తుతాం : ఎఎ ర‌హీం

దేశవ్యాప్తంగా ఒకరోజు నిరాహార దీక్షకు సిజెపి పిలుపు

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : నీట్ పేప‌ర్ లీక్‌, సిబిఎస్ఇ అవ‌క‌త‌వ‌క‌ల‌కు బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఆరు రోజులుగా నిర‌వ‌ధిక నిరాహార దీక్ష చేస్తున్న ప‌ర్యావ‌ర‌ణ‌ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు, 14 రోజులుగా ఆందోళ‌న‌ చేస్తున్న కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి)కి డివైఎఫ్‌ఐ సంఘీభావం తెలిపింది. శుక్ర‌వారం డివైఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడు, రాజ్య‌స‌భ ఎంపి ఎఎ రహీం, కోశాధికారి సంజీవ్ కుమార్ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. డివైఎఫ్‌ఐ నాయకులు సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అధికార ప్రతినిధి సౌరవ్ దాస్‌లకు భగత్ సింగ్ చిత్రపటాన్ని కూడా అందజేశారు. ఈ సందర్భంగా ర‌హీం మాట్లాడుతూ ‘‘అభిజిత్, ఆయన మిత్రులు ఎదురుగాలిలో ప్రయాణిస్తున్నారు. 1980 నుంచి డివైఎఫ్‌ఐ ఇదే విధంగా ప్రయాణిస్తోంది. విద్యార్థుల సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా ఉంది’’ అని అన్నారు. నిరాహార దీక్షను విరమించేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రధానమంత్రికి లేఖ రాస్తానని, పార్లమెంటులో ఈ విషయాన్ని లేవనెత్తుతానని అన్నారు. ఎఐఎస్ఎకు చెందిన ఆరుగురు విద్యార్థులు కూడా నిరసన స్థలంలోని వేరొక వేదిక నుంచి తమ నిరవధిక నిరాహార దీక్షను కొనసాగించారు. కాంగ్రెస్ అమరావతి ఎంపి బల్వంత్ బసవంత్ వాంఖడే, తృణమూల్ ఎంపి మహువా మొయిత్రా ఆందోళ‌న‌కు సంఘీభావం తెలిపారు.

మాకు రాజకీయ లక్ష్యాలు లేవు : సోన‌మ్ వాంగ్‌చుక్‌

సోనమ్ వాంగ్‌చుక్‌తో పాటు, దీప్కే, సిజెపి నాయకులు శుక్రవారం నిరాహార దీక్ష చేపట్టారు. 'మాకు రాజకీయ లక్ష్యాలు లేవు. ప్రస్తుత ప్రభుత్వంలో మార్పు తీసుకురావడమే ఈ ఆందోళ‌న‌ లక్ష్యం. శాంతియుతంగా లేవనెత్తిన డిమాండ్లు వినండి' అని సోనమ్ అన్నారు. సోనమ్ వాంగ్‌చుక్ "చాలా బలహీనంగా, అలసిపోయినట్లు" కనిపించారని సిజెపి వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. రక్తపోటు 110/75, నాడి నిమిషానికి 72 సార్లు, రక్తంలో చక్కెర స్థాయి 61గా నమోదైందని తెలిపారు. గంటగంటకూ వాంగ్‌చుక్ పరిస్థితి మరింత దిగజారుతోందని దిప్కే అన్నారు. "ఒక గొప్ప విద్యావేత్త విద్యార్థులకు న్యాయం కోసం తన ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ప్రభుత్వం ఎప్పుడు మేల్కొంటుంది?" అని ఆయన ప్రశ్నించారు. ఉద్య‌మానికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఉన్న మద్దతుదారులు తమ ఇళ్లలోనే ఒక రోజు నిరాహార దీక్ష పాటించి, నిరసనలో పాలుపంచుకోవాలని దీప్కే విజ్ఞప్తి చేశారు.

యువత సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు

ఉద్యమానికి విద్యావంతుల మద్దతు

సిజెపి ఉద్యమం ఉద్యోగ సంక్షోభంపై ఆందోళన చెందుతున్న విద్యావంతులైన యువతను ఆకర్షిస్తోంది. ఉద్యోగ సంక్షోభం, తక్కువ వేతనాలపై పలువురు యువకులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. మహ్మద్ సిద్ధిఖీ జంతర్ మంతర్ సమీపంలో సిజెపి నిరసన ప్రదర్శనలకు క్రమం తప్పకుండా హాజరవుతూ, నిరసనకారుల నొప్పులున్న కాళ్లకు, బిగుసుకుపోయిన కీళ్లకు ఫిజియోథెరపీ చికిత్స అందిస్తున్నారు. 2024లో జామియా హమ్దార్డ్ డీమ్డ్ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ పట్టా పొందిన సిద్ధిఖీ, తనకు స్థిరమైన ఉద్యోగం లేకపోవడంతో నిరసన తెలుపుతున్నారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కొద్దికాలం పనిచేశాడు. "ప్రైవేట్ యజమానులు తక్కువ జీతం ఇచ్చి, తమ ఉద్యోగులతో ఎక్కువసేపు పని చేయిస్తారు. నాకు నెలకు కేవలం రూ.18,000 మాత్రమే చెల్లించేవారు" అని ఆయన అన్నారు. "ప్రభుత్వ బోధనా ఆసుపత్రిలో జూనియర్ ఫిజియోథెరపిస్ట్‌కు జీతం రూ.50,000 పైగా ఉంటుంది" అని ఆయన అన్నారు. "నేను ఆ ఉద్యోగం వదిలేసి ప్రైవేట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాను" అని తెలిపారు. తాను ప్రైవేటు ఆసుపత్రిలో ఇచ్చే జీతం కంటే ఎక్కువ సంపాదిస్తున్నానని అన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చరిత్రలో నాలుగో సంవత్సరం పిహెచ్‌డి విద్యార్థి అయిన మహమ్మద్ బిలాల్ కూడా ఇలాంటి అంశాల‌నే వ్యక్తం చేశారు. "విద్యావంతులైన యువతకు ఉద్యోగావకాశాలు తగ్గిపోతున్నాయి. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు" అని ఆయన విమర్శించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్