- సీఏఏ దరఖాస్తుల పరిశీలన ఇక జిల్లా కలెక్టర్లకు
- 8 రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం తాజా ఉత్తర్వులు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), 2019 కింద పెండింగ్‌లో ఉన్న పౌరసత్వ దరఖాస్తుల పరిశీలన, పరిష్కార బాధ్యతలను ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని జిల్లా కలెక్టర్లకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అప్పగించింది. ఈ మేరకు ఆగస్టు 19న ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, అస్సాం (గిరిజన ప్రాంతాలు మినహా), త్రిపుర (గిరిజన ప్రాంతాలు మినహా), జమ్మూకశ్మీర్, లడఖ్‌లలోని జిల్లా కలెక్టర్లకు ఈ అధికారాలు కల్పించారు. ఆయా ప్రాంతాల్లో సాధికార కమిటీలు, జిల్లా స్థాయి కమిటీల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సంబంధిత కలెక్టర్లకు బదిలీ చేయాలని ఆదేశించారు.
ఆగస్టు 19న నోటిఫై చేసిన పౌరసత్వ (మూడవ సవరణ) నిబంధనలు, 2026 ప్రకారం కలెక్టర్లు సీఏఏలోని సెక్షన్ 6బీ కింద పౌరసత్వం కోసం దరఖాస్తులను స్వీకరించి, పత్రాలను పరిశీలించి, అవసరమైన విచారణ నిర్వహించవచ్చు. దరఖాస్తుదారుడి అర్హతపై సంతృప్తి చెందిన తర్వాత పౌరసత్వం మంజూరు చేసే అధికారం కూడా కలెక్టర్లకు ఉంటుంది. దరఖాస్తుదారుడు తగిన అవకాశాలు ఇచ్చినప్పటికీ వ్యక్తిగతంగా హాజరై దరఖాస్తుపై సంతకం చేయడం, విధేయతా ప్రమాణం చేయడం వంటి ప్రక్రియలను పూర్తి చేయకపోతే దరఖాస్తును తిరస్కరించవచ్చని సవరించిన నిబంధనలు పేర్కొంటున్నాయి.
ఇప్పటివరకు ఈ దరఖాస్తుల పరిశీలనలో పలు కేంద్ర ప్రభుత్వ విభాగాలతో కూడిన సాధికార కమిటీలు కీలక పాత్ర పోషించాయి. తాజా నిర్ణయంతో ఆయా కమిటీల వద్ద ఉన్న పెండింగ్ దరఖాస్తులు నేరుగా జిల్లా కలెక్టర్ల పరిధిలోకి రానున్నాయి. 2024లో అమల్లోకి వచ్చిన సీఏఏ నిబంధనలను అమలు చేయడానికి గతంలో జారీ చేసిన కొన్ని ఉత్తర్వులను కూడా కేంద్రం రద్దు చేసింది.
సీఏఏ కింద పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి 2014 డిసెంబర్ 31లోపు భారత్‌కు వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవ వర్గాలకు చెందిన అర్హులైన వ్యక్తులకు పౌరసత్వం కోసం ఈ చట్టం తెచ్చామని కేంద్రం చెబుతోంది. తాజా మార్పుతో ఈ ప్రక్రియను జిల్లా స్థాయిలో వేగవంతం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.








కామెంట్‌లు (0)