బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌..

3 గంటల క్రితం

Festive gift for railway employees
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 01:46 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 2030-31 వ‌ర‌కు జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం పొడిగింపు

  • కేంద్ర మంత్రివర్గం నిర్ణయం

ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుకగా 78 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత ఆధారిత బోనస్ (పిఎల్‌బి) చెల్లించేందుకు కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా 11,40,770 మంది నాన్‌ గెజిటెడ్‌ రైల్వే ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. బోనస్‌ చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,009.61 కోట్లను కేటాయించింది. అర్హులైన ఒక్కో ఉద్యోగికి గరిష్ఠంగా రూ.17,951 బోనస్‌ అందనుంది. ట్రాక్‌ నిర్వహణ సిబ్బంది, లోకో పైలట్లు, రైలు మేనేజర్లు (గార్డులు), స్టేషన్‌ మాస్టర్లు, సూపర్‌వైజర్లు, సాంకేతిక సిబ్బంది, టెక్నీషియన్‌ సహాయకులు, పాయింట్స్‌మెన్‌, మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఉద్యోగులు, ఇతర గ్రూప్‌-సి సిబ్బంది ఈ బోనస్‌కు అర్హులు. బుధవారం నాడిక్క‌డ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ఐడిబిఐ బ్యాంక్‌లో వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణకు కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. దీనికి అనుగుణంగా, ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్‌లోని మొత్తం ఈక్విటీ వాటాలో 60.72 శాతం భాగాన్ని విక్రయించాలని నిర్ణయించింది. మొత్తం రూ.52,878 కోట్ల ఫెయిర్‌ఫాక్స్‌ సంస్థకు విక్రయించాలని ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

​2030-31 వ‌ర‌కు జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం పొడిగింపు

'జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం'ను 2026-27 నుంచి 2030-31 వరకు కొనసాగించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ అయిదేళ్ల కాలానికి గానూ రూ. 53,428 కోట్ల మొత్తం వ్యయంతో ఈ పథకాన్ని కొనసాగిస్తారు. ఈ పథకం, దాని అనుబంధ పథకాల పేర్లను మార్చడం, దివ్యాంగుల పెన్షనుకు సంబంధించి అర్హత ప్రమాణాలు, లబ్ధిదారుల పరిధి, అందించే సహాయం మొత్తాన్ని సవరించడం, వృద్ధులు, వితంతువుల పెన్షన్ పథకాలతో పాటు కుటుంబ ప్రయోజన పథకాన్నీ ప్రస్తుతం ఉన్న రూపంలోనే కొనసాగించడం వంటివి ఉన్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్