రిటైర్మెంట్ తర్వాత నిధులపై ఇపిఎఫ్‌ఓ కొత్త ప్రతిపాదన
ఆమోదించిన ట్రస్టీల బోర్డు
న్యూఢిల్లీ : పదవీ విరమణ చేసిన అనంతరం ఉద్యోగులు ఒకేసారి తమ రిటైర్మెంట్ నిధులను తీసుకోకుండా దశలవారీగా తీసుకునేలా సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యుపి) ప్రతిపాదనను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సిబిటి) ఆమోదించింది. ఈ ప్రతిపాదన ప్రకారం ఇపిఎఫ్ ఉద్యోగులు తమ ఉద్యోగ జీవితంలో కూడబెట్టిన సొమ్మును విడతలవారీగా తీసుకోవడానికి అవకాశం కల్పించింది. ఎస్‌డబ్ల్యుపిని ప్రవేశపెట్టడం వల్ల ఇపిఎఫ్ సభ్యులు తమ పదవీ విరమణ పొదుపు మొత్తాలను రిటైర్మెంట్ తర్వాత సుస్థిరమైన, ఊహించిగలిగిన మొత్తాల్లో దశలవారీగా విత్‌డ్రా చేసుకోవడానికి వెసులుబాటు వుంటుందని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఓ) పేర్కొంది. అదే సమయంలో కార్పస్ నిధులపై తమ యాజమాన్య హక్కులనూ కాపాడుకోవచ్చు. ఒకవేళ సభ్యుడు ఈ చెల్లింపుల వ్యవధిలోనే మరణించిన సందర్భంలో నామినీ లేదా డిపెండెంట్ మిగిలిన బ్యాలన్స్ మొత్తాలను ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు లేదా విడతలవారీగానే సొమ్మును తీసుకునే వీలు కూడా వుందని ఇపిఎఫ్‌ఓ వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదన వల్ల సభ్యులకు వెసులుబాటుతో కూడిన, క్రమం తప్పని, విశ్వసనీయమైన ఆదాయ మార్గం అందించినట్లవుతుందని ఆ వర్గాలు తెలిపాయి. దీనివల్ల పదవీ విరమణ చేసినా ఆర్థిక భద్రతను ఈ చర్య పెంచుతుందని తెలిపాయి. అదేసమయంలో తమ కుటుంబ ప్రయోజనాలను కాపాడుకోవడానికి వీలు వుంటుందని పేర్కొన్నాయి. ప్రతిపాదిత పథకం కింద పదవీ విరమణ నిధులను ఏకమొత్తంలో కాకుండా నెలవారీ లేదా మూడు నెలలకోసారి లేదా ఆరు మాసాలు, ఏడాదికోసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎంత మొత్తమైతే తీసుకుంటామో ఆ మిగిలిన మొత్తానికి వడ్డీ యథావిధిగా కొనసాగుతుంది. అవసరమైతే ఎప్పుడైనా ఈ ఎస్‌డబ్ల్యుపి నుండి వైదొలగే అవకాశం వుంది. చందాదారుడు మరణించిన సందర్భంలో జీవిత భాగస్వామి లేదా నామినీ కూడా ఈ పథకాన్ని కొనసాగించవచ్చు. వారికి అవసరమైనపుడు వారు కూడా దీన్నుండి వైదొలగే అవకాశం వుంది. ఇప్పటికే ఇపిఎఫ్‌ఓ వేతన పరిమితిని రూ.15వేల నుండిరూ.25వేలకు పెంచడం వల్ల 50 లక్షల నుండి కోటి మంది వరకు కొత్త లబ్దిదారులు ప్రయోజనం పొందనున్నారు. తప్పనిసరైన సామాజిక భద్రతా ప్రయోజనం కింద అనేకమంది ఉద్యోగులు రావడానికి అవకాశం కలిగింది.








కామెంట్‌లు (0)