సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ చంబాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లోయలో పడి ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... ఈ ప్రమాదం బుధవారం రాత్రి జరిగింది. చంబా జిల్లాలోని చంబా - మస్రూండ్ మార్గంలో ఛత్రుండ్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఎస్‌యువి కారు అదుపుతప్పి రోడ్డుపై నుంచి ఎత్తైన లోయలోకి పడిపోయింది. కుథేడ్ గ్రామ్ పంచాయతీ పరిధిలోని మహల్ గ్రామానికి చెందిన వారు. బాధితులంతా వేరే గ్రామంలో జరిగిన ఫంక్షన్‌కి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఛత్రుడ్ సమీపంలోనే కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ లోయలోకి పడిపోయింది. వాహనం పూర్తిగా ధ్వంసమై నుజ్జునుజ్జయింది. దీంతో ఆ వాహనంలోని ప్రయాణీకులు ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు గాయాలతో మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. బాధితుల వివరాల గురించి పోలీసులు సేకరించేపనిలో ఉన్నారు. కారు లోయలో పడిన తర్వాత పెద్ద శబ్దం వినిపించింది. దీంతో స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు ఎస్‌పి విజయ్ సక్లానీ తెలిపారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియలేదని ఆయన అన్నారు.









కామెంట్‌లు (0)