పాట్నా : బీహార్లో జేడీయూ ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. మాజీ సిఎం నితీష్ కుమార్ రాజకీయంగా ఎదిగేందుకు తాను తొమ్మిది మందిని హత్య చేయించినట్లు ఆయన వ్యాఖ్యానించారు. విమర్శలు వెల్లువెత్తడంతో మాట మార్చి, ఆ తొమ్మిది మంది తన అనుచరులని, లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వ హయాంలో హత్యకు గురయ్యారని ఆరోపించారు.
అక్టోబర్ 23న జరగనున్న శాసన మండలి ఎన్నికల్లో తన రాజకీయ ప్రత్యర్థి నీరజ్ కుమార్ను జేడీయూ బరిలోకి దింపడంపై అనంత్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ... ‘నితీష్ కుమార్తో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. ఆయన రాజకీయంగా నిలదొక్కుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు అండగా నిలిచా. ఆయనకు సహాయం చేయడానికి తొమ్మిది మందిని హత్య చేయించా ’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఆర్జేడీ తీవ్రంగా స్పందించింది. అనంత్ సింగ్ మాటలు రాజకీయ నేరాలను అంగీకరించినట్లుగా ఉన్నాయని విమర్శించింది. నేరగాళ్ల ముఠాలతో సంబంధాల ద్వారానే నితీష్ రాజకీయంగా ఎదిగారని ఆర్జేడీ నేత శక్తి సింగ్ యాదవ్ ఆరోపించారు. ఈ విమర్శల నేపథ్యంలో అనంత్ సింగ్ వివరణ ఇస్తూ .... లాలూ యాదవ్ ప్రభుత్వ హయాంలో తన అనుచరుల్లో తొమ్మిది మంది హత్యకు గురయ్యారని, తనపైనా కాల్పులు జరిగాయని చెప్పారు. నితీష్ కు మద్దతు ఇచ్చినందుకే ఈ దాడులు జరిగాయని ఆరోపించారు. అయితే ... అనంత్ సింగ్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని జేడీయూ స్పష్టం చేసింది. నితీష్ కుమార్కు నేరగాళ్లతో సంబంధాలు లేవని, హింసాత్మక కార్యకలాపాల్లో ఆయనకు ప్రమేయం లేదని పార్టీ జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను పార్టీ పట్టించుకోదని చెప్పారు.








కామెంట్లు (0)