న్యూఢిల్లీ : బిజెపి ఎంపి, సినీ నటి కంగనా రనౌత్ జెన్-జీ నిరసనకారులపై చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికే వివాదంలో ఉండగా .... తాజాగా సిజెపి (Cockroach Janata Party) ప్రతినిధి సౌరవ్ దాస్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసి మరోసారి చర్చనీయాంశమయ్యారు. తన వ్యాఖ్యలను విమర్శించిన సౌరవ్ దాస్ ను 'పనికిమాలినోడు', 'ఉద్యోగం లేనివాడు' అంటూ విమర్శించారు.
ఎఎన్‌ఐకి సౌరవ్ దాస్ ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్న కంగనా .... "గూగుల్‌లో ఈ వ్యక్తి గురించి వెతికాను. అతనికి 28 ఏళ్లు. అతడు పనికిమాలినోడని తెలిసింది. అలాంటి వ్యక్తి తనను తాను విద్యార్థి అని ఎలా చెప్పుకుంటున్నాడో అర్థం కావడం లేదు" అని వ్యాఖ్యానించారు. "నేను రాజకీయాల్లోకి వచ్చి రెండేళ్లే కావచ్చు. కానీ ప్రజా జీవితంలోకి వచ్చి 20 ఏళ్లు అవుతోంది. అతడి వయసులోనే రెండు జాతీయ అవార్డులు సాధించాను" అని పేర్కొన్నారు.
'నేను కేవలం ఎంపిని మాత్రమే కాదు' : కంగనా
తాను కేవలం రాజకీయ నాయకురాలిని మాత్రమే కాదని కంగనా తెలిపారు. సినీనటిగా, నిర్మాతగా, స్క్రీన్‌రైటర్‌గా, వ్యాపారవేత్తగా కూడా తన ప్రయాణం కొనసాగుతోందని చెప్పారు. " కొత్త ఎంపి గా బాధ్యతలు ఎక్కువగా ఉండటంతో ఒత్తిడి ఎదురైంది. ఎందుకంటే నేను చిత్ర నిర్మాతను, ప్రదర్శన కళాకారిణిని, నిర్మాతను, రచయిత్రిని, వ్యాపారవేత్తను కూడా" అని పేర్కొన్నారు. ఎప్పుడూ డిమాండ్‌లో ఉండే జీవితాన్ని సౌరవ్ దాస్ వంటి వారు అర్థం చేసుకోలేరని వ్యాఖ్యానించారు.
'ముందు నైపుణ్యం నేర్చుకో' : కంగనా
సౌరవ్ దాస్‌ను ఉద్దేశించి కంగనా మరింత ఘాటుగా స్పందించారు. " నీ సమస్యలు వ్యక్తిగతమైనవి. నువ్వు విద్యార్థివి కాదు. కేవలం పనికిమాలిన వ్యక్తివి. ముందు ఏదైనా నైపుణ్యం నేర్చుకోవడం ప్రారంభించు " అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
జెన్ జీ పై వివాదకర వ్యాఖ్యలు : కంగనా
నీట్-యూజీ 2026 పేపర్ లీక్ ఆరోపణలపై జరిగిన విద్యార్థుల నిరసనల సందర్భంగా కంగనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. "నా జీవితంలో ఒకేచోట ఇంత కంపు ఎప్పుడూ చూడలేదు. జెన్-జీ నిరసనకారుల రీల్స్ వాంతులు తెప్పించేలా ఉన్నాయి. వారు మాట్లాడే తీరు, ఉపయోగించే భాష నేను ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి వారిని ఎవరు కంటున్నారు ? ఎవరు పెంచుతున్నారు ? " అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
ప్రతిక్షాల అభ్యంతరం .....
కంగనా వ్యాఖ్యలను ప్రతిపక్ష నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ ఎంపి ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ మాట్లాడుతూ .... జెన్-జీ యువత కంగనాకు తగిన సమాధానం చెబుతుందని అన్నారు. కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి కూడా యువతను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శించారు.
సౌరవ్ దాస్ ప్రతిస్పందన ....
కంగనా వ్యాఖ్యలకు ముందు సౌరవ్ దాస్ కూడా ఆమెపై విమర్శలు చేశారు. "కంగనాను ఆమె సొంత పార్టీ నేతలే పెద్దగా పట్టించుకోరు. ఆమెను సీరియస్‌గా తీసుకోనప్పుడు మేమెందుకు తీసుకోవాలి ? " అని ఎఎన్‌ఐతో అన్నారు. జెన్-జీ, జెన్ ఆల్ఫా తరాలు దేశ ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని బలోపేతం చేసే పనిలో ఉన్నాయని, కంగనా వ్యాఖ్యలను వారు పెద్దగా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. నీట్-యూజీ 2026 పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో సిజెపి కీలక పాత్ర పోషించిన సంగతి విదితమే.








కామెంట్‌లు (0)