- కుల వివక్ష, సంస్థాగత వేధింపులే కారణమన్న తల్లిదండ్రులు
- ఏడాదిలో నాలుగో ఘటన: క్యాంపస్‌లో భగ్గుమన్న విద్యార్థులు
- పరీక్షలు వాయిదా, రాజీనామా చేస్తానన్న డైరెక్టర్
ముంబయి: దేశంలోని ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యా సంస్థల్లో ఒకటైన ఐఐటి బాంబే మరోసారి విషాదంలో మునిగింది. ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో రెండో సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల సాహిల్ వాకోడే శుక్రవారం సాయంత్రం హాస్టల్ గదిలో విగతజీవిగా కనిపించాడు. ఆత్మహత్యగా భావిస్తున్న ఈ ఘటన క్యాంపస్‌ను కుదిపేసింది. ఈ ఏడాదిలో ఇది నాలుగో ఘటన కావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సాహిల్ మృతికి సంస్థాగత వేధింపులు, కుల వివక్షే కారణమని అతని తల్లిదండ్రులు తెలిపారు. దీనికి సంస్థ డైరెక్టర్, డీన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధ్యులను అరెస్టు చేసే వరకు మృతదేహాన్ని క్యాంపస్ నుంచి తీసుకెళ్లబోమని బ్యాంకు ఉద్యోగి అయిన తండ్రి రవీంద్ర వాకోడే శనివారం సాయంత్రం స్పష్టం చేశారు. ‘‘అతను మాకు ఏకైక కుమారుడు. చాలా కష్టపడి చదివేవాడు, ఎంతో దృఢచిత్తం కలవాడు. ఆత్మహత్య చేసుకునే రకం కాదు. అతని మరణానికి ఈ సంస్థే కారణం. న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటాం,’’ అని ఆయన మీడియాతో అన్నారు.
న్యాయం జరిగే వరకూ పోరాడతాం...
సాహిల్ మరణంతో శుక్రవారం మొదలైన విద్యార్థుల ఆందోళన శనివారం కూడా కొనసాగింది. వందలాది మంది విద్యార్థులు సంస్థ ప్రధాన భవనం వద్ద సాహిల్ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడతామని నినాదాలు చేశారు. డైరెక్టర్ ప్రొఫెసర్ శిరీష్ కేదారే, ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లాల రాజీనామా చేయాల్సిందేనని విద్యార్థులు పట్టుబట్టారు. అంతేకాదు, ఈ ఏడాదిలో జరిగిన నలుగురు విద్యార్థుల ఆత్మహత్యలపై స్వతంత్ర విచారణ, ఆత్మహత్యల నివారణకు ఇన్‌స్టిట్యూట్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. అలాగే, పరీక్షలు, ఇతర అకడమిక్ కమిటీల్లో విద్యార్థులకు ప్రాతినిధ్యం కావాలని, నిరసనలో పాల్గొన్నవారిపై క్రమశిక్షణా చర్యలు, బెదిరింపుల నుంచి రక్షణ, మిడ్-సెమిస్టర్, ఎండ్-సెమిస్టర్ పరీక్షల తర్వాత విరామాలు, మానసిక ఆరోగ్య అవగాహన వర్క్‌షాప్‌లు నిర్వహించాలని, వాకోడే కుటుంబానికి పరిహారం ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అయితే, ఈ ఆందోళనల నేపథ్యంలో జరుగుతున్న మిడ్-సెమిస్టర్ పరీక్షలను సంస్థ వాయిదా వేసింది. డైరెక్టర్ ప్రొఫెసర్ శిరీష్ కేదారే విద్యార్థులను కలిసి, తాను సోమవారం రాజీనామా చేస్తానని చెప్పారు. మరోవైపు, పరీక్షా హాలులో సాహిల్ మొబైల్ ఫోన్ వాడుతూ పట్టుబడ్డాడని, సమాధానాల కోసం ప్రశ్నపత్రాన్ని చాట్‌జిపిటిలో అప్‌లోడ్ చేశాడని ఆరోపిస్తూ ఐఐటి బాంబే సమర్ధించుకుంది.








కామెంట్‌లు (0)