- డీలిమిటేషన్ బిల్లుపై ఉమ్మడి వ్యూహం
- వివరాలు ఇప్పుడే చెప్పలేనన్న కేంద్ర మంత్రి రిజిజు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో: డీలిమిటేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వ వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష ఇండియా బ్లాక్ సమావేశమై ఉమ్మడి కార్యాచరణను రూపొందించనుంది. శనివారం ఉదయం ఇండియా బ్లాక్, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు భేటీ కానున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ వెల్లడించారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశంలో విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని వేణుగోపాల్ విమర్శించారు. కేంద్రం దేశ ప్రజల ముందు పెద్ద ఉచ్చు పన్నుతోందన్నారు. డిఎంకెతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలనూ సంప్రదిస్తున్నామని చెప్పారు. రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీలన్నీ ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆ వివరాలు ఇప్పుడే చెప్పలేను: రిజిజు
సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కీలకమైన శాసన వ్యవహారాలు చేపట్టనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. అయితే సభలో ప్రవేశపెట్టనున్న బిల్లుల వివరాలను ఇప్పుడే చెప్పలేనన్నారు. దేశానికి సంబంధించిన అత్యంత కీలక అంశాలను సభ ముందుకు తీసుకొస్తామని తెలిపారు. ప్రపంచమంతా భారత ప్రజాస్వామ్యాన్ని గమనిస్తోందని, పార్లమెంటు సమావేశాలను బాధ్యతాయుతంగా నిర్వహించడం అన్ని పార్టీల బాధ్యత అని పేర్కొన్నారు. సభలో అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం ఎంపిలకు ఉంటుందని, అయితే కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా చూడాలని కోరారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే, జనాభా నియంత్రణలో విజయం సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళం, కర్ణాటక రాష్ట్రాలు ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా నియంత్రణలో సాధించిన విజయానికి రాజకీయ ప్రాతినిధ్యంలో శిక్ష పడకూడదని ఆ రాష్ట్రాలు కోరుతున్నాయి.








కామెంట్‌లు (0)