- సిఇసిపై తొలగింపు నోటీసు
- ఎస్‌ఐఆర్‌పై ఆందోళనల నేపథ్యంలో కీలక నిర్ణయాలకు సిద్ధం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎన్నికల కమిషన్ విశ్వసనీయత, ఎన్నికల కమిషన్ వ్యవహారశైలి, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ప్రతిపక్షాలు ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో ఇండియా బ్లాక్ కీలక భేటీకి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష ఇండియా బ్లాక్ సమన్వయ సమావేశం కానుంది. సెప్టెంబరు 30న న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఇండియా బ్లాక్ పార్టీల నేతలు సమావేశం కానున్నారు. సిఇసి జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ పార్లమెంట్‌లో మరోసారి నోటీసు ఇచ్చే అంశంతోపాటు ఎస్‌ఐఆర్‌పై ఉమ్మడి కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఎన్నికల కమిషన్‌లోనే ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఐక్యమయ్యాయి.
మరోసారి తొలగింపు నోటీసు
సిఇసి జ్ఞానేష్‌కుమార్‌పై పార్లమెంట్‌లో మరోసారి తొలగింపు నోటీసు ఇచ్చేందుకు ప్రతిపక్ష పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. న్యాయ నిపుణులతో పరిశీలించిన అనంతరం లోక్‌సభ, రాజ్యసభల్లో నోటీసు సమర్పించే అవకాశముందని సమాచారం. ఇది ప్రతిపక్షాల నుంచి జ్ఞానేష్‌కుమార్‌పై చేపడుతున్న మూడో ప్రయత్నంగా మారనుంది. ఇప్పటికే జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తోన్నాయి. ఎస్‌ఐఆర్ అమలుపై తమ ఆందోళనలను ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. సెప్టెంబరు 29న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించనుంది.
ఇండియా బ్లాక్ సమన్వయానికి ఎంఎ బేబి చొరవ
ఎన్నికల కమిషన్ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలను సమన్వయం చేసేందుకు సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి చొరవ తీసుకున్నారు. ఈ వ్యవహారంపై ఐక్య ఆందోళనలు, ఉమ్మడి కార్యాచరణ కోరుతూ ప్రతిపక్ష పార్టీలకు బేబీ లేఖ రాసారు. ఇండియా బ్లాక్, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలకు సమావేశం కోసం సంప్రదింపులు కూడా జరిపారు. వివిధ పార్టీల నేతలతో చర్చలు జరిపి ఉమ్మడి కార్యాచరణకు అనుకూలత సాధించే ప్రయత్నం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 30 సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు వివిధ పార్టీల నేతలతో ఎంఎ బేబి మాట్లాడారు. ఎన్నికల కమిషన్ అంశంపై సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయంతో ఆమె ఏకీభవించినట్లు సమాచారం.
దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధం..
ఎస్‌ఐఆర్, ఎన్నికల కమిషన్ పనితీరుపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతున్నాయి. శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు జరిగాయి. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన జరిగింది. జమ్మూకాశ్మీర్, అస్సాం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, చండీగఢ్, మణిపూర్, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాల్లో నిరసనలు నమోదయ్యాయి. సిఇసి రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. సెప్టెంబరు 30 సమావేశంలో దేశవ్యాప్త కార్యాచరణ, పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహం, ఎస్‌ఐఆర్‌పై ఉమ్మడి వైఖరి వంటి అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, శివసేన (యుబిటి), ఆర్‌జెడి, డిఎంకె, ఆప్ తదితర పార్టీల అగ్రనేతలు సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్నికల కమిషన్ స్వతంత్రత, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకత, సంస్థాగత నిర్ణయాలపై నెలకొన్న వివాదం తదితర అంశాల నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది.








కామెంట్‌లు (0)