ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫంక్షన్లతోనూ ద్రవ్యోల్బణ సెగలు..

12 గంటల క్రితం

ఫంక్షన్లతోనూ ద్రవ్యోల్బణ సెగలు..
పెళ్లిళ్ల సీజన్‌, ఎల్‌నినోతో ముప్పు.. 
6 శాతం ఎగువకు రిటైల్‌ ద్రవ్యోల్బణం
ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 09:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పెళ్లిళ్ల సీజన్‌, ఎల్‌నినోతో ముప్పు..

  • 6 శాతం ఎగువకు రిటైల్‌ ద్రవ్యోల్బణం

  • ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక

న్యూఢిల్లీ : దేశంలో ఫంక్షన్లు కూడా ధరలకు ఆజ్యం పోయనున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్వయంగా హెచ్చరించింది. ఎల్‌‌నినోకు తోడు పండుగల కొనుగోళ్లు కొనసాగడం, పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం, వాతావరణ అనిశ్చితులు ఆహార, ఆహారేతర వస్తువుల ధరలను పెంచవచ్చని తెలిపింది. రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందని నవంబర్‌ నెలవారీ ఆర్థిక సమీక్ష (ఎంఇఆర్‌)లో ఆర్థిక శాఖ వెల్లడించింది. అక్టోబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి చేరి ఆర్‌బిఐ నిర్దేశించిన 6 శాతం గరిష్ట పరిమితిని దాటిన విషయాన్ని గుర్తు చేసింది. తీవ్ర ఎల్‌‌నినో ఏర్పడే అవకాశాలు, వాతావరణ మార్పులు ఆహార ధరలపై ఒత్తిడిని పెంచవచ్చని పేర్కొంది. నవంబర్‌లోనూ పండుగల ప్రభావం కొనసాగడం, పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభంతో వస్తువుల డిమాండ్‌ పెరిగే అవకాశం ఉందని విశ్లేషించింది. ఈ పరిణామాలు రానున్న ద్రవ్యోల్బణ గణాంకాల్లో పెరుగుదలకు దోహదం చేయనున్నాయని హెచ్చరించింది.​

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు, హర్మూజ్‌ జలసంధి‌లో ఉద్రిక్తతలతో చమురు దిగుమతి వ్యయం పెరుగుతుందని తెలిపింది. సముద్ర రవాణా చార్జీల పెరుగుదల ధరలకు ఆజ్యం పోస్తోందని పేర్కొంది. ఇవి టోకు, రిటైల్‌ ధరలపై ప్రభావం చూపవచ్చని హెచ్చరించింది. అయితే అంతర్జాతీయ చమురు ధరలు నవంబర్‌ ప్రారంభంలో బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు రావడం, విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో రూపాయి బలోపేతం కావడం కొంత దిగుమతి ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించే అవకాశముందని తెలిపింది.

ధరల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ డిసెంబర్‌ త్రైమాసికంలో దేశ ఆర్థిక కార్యకలాపాలు నిలకడగా కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. నవంబర్‌ 13 నాటికి దేశ విదేశీ మారక నిల్వలు 705.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయని.. ఇవి సుమారు పది నెలల దిగుమతులకు సరిపోతాయని వెల్లడించింది. అయినప్పటికీ.. అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ వాణిజ్య విధానాల్లో అనిశ్చితులు ఆర్థిక రంగానికి సవాళ్లుగా మారవచ్చని హెచ్చరించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్