శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మళ్లీ వడ్డీ రేట్ల బాదుడు..!

2 గంటల క్రితం

మళ్లీ వడ్డీ రేట్ల బాదుడు..!
డిసెంబర్‌‌లో ఆర్‌‌బిఐ పావు శాతం పెంచొచ్చు
ద్రవ్యోల్బణం 6.3 శాతానికి చేరొచ్చు
పరిశోధన సంస్థల అంచనా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 11:15 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • డిసెంబర్‌‌లో ఆర్‌‌బిఐ పావు శాతం పెంచొచ్చు

  • ద్రవ్యోల్బణం 6.3 శాతానికి చేరొచ్చు

  • పరిశోధన సంస్థల అంచనా

న్యూఢిల్లీ : రుణ గ్రహీతలపై వడ్డీ భారం మరింత పెరగొచ్చని పరిశోధన సంస్థలు అంచనా వేస్తోన్నాయి. వచ్చే నెల డిసెంబరులో జరిగే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌‌బిఐ) రెపో వడ్డీరేటును 25 బేసిస్‌ పాయింట్లు (పావు శాతం) పెంచవచ్చని ఎస్‌బిఐ రీసెర్చ్‌ అంచనా వేసింది. గతంలో 50 బేసిస్‌ పాయింట్ల పెంపు ఉంటుందని అంచనా వేసిన సంస్థ.. రూపాయిపై కొంత ఒత్తిడి తగ్గడం, అంతర్జాతీయంగా భౌగోళిక పరిస్థితులు మెరుగుపడటం వంటి పరిణామాల నేపథ్యంలో తన అంచనాను సవరించింది. దీంతో రెపో రేటు తుదకు 6 శాతానికి చేరవచ్చని పేర్కొంది. మరోవైపు 5.75 శాతం వద్దే కొనసాగించే అవకాశాన్ని కూడా 50 శాతంగా అంచనా వేసింది.

​ఆహార ధరలు ఎగిసిపడటంతో అక్టోబరులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి పెరగ్గా.. నవంబరులో అది గరిష్ఠంగా 6.3 శాతానికి చేరొచ్చని తెలిపింది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టవచ్చని ఎస్‌బిఐ రీసెర్చ్‌ అంచనా వేసింది. అయితే ఫిబ్రవరిలో మరోసారి వడ్డీరేట్ల పెంపు చేపట్టడం సమంజసం కాదని నివేదిక అభిప్రాయపడింది. కేంద్ర బడ్జెట్‌ సమీపిస్తున్న నేపథ్యంలో ఆ సమయంలో రేట్ల పెంపు నిర్ణయం తీసుకోకపోవచ్చని అంచనా వేసింది. ఇప్పటికే అక్టోబరులో 25 బేసిస్‌ పాయింట్ల పెంపు జరిగిందని, డిసెంబరులో మరో 25 బేసిస్‌ పాయింట్ల పెంపు ఉండవచ్చని కెనరా బ్యాంక్‌ ముఖ్య ఆర్థికవేత్త జి. మాధవన్‌కుట్టి తెలిపారు. తాము అంచనా వేసిన మొత్తం 100 బేసిస్‌ పాయింట్ల పెంపులో మిగిలిన వడ్డీరేట్ల పెంపు వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా పడవచ్చని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం 2027 జూన్‌ వరకు 6 శాతానికి పైనే కొనసాగవచ్చని యాక్సిస్‌ బ్యాంక్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ తనయ్‌ దలాల్‌ అంచనా వేశారు. దీంతో విధాన వడ్డీరేట్లు తటస్థ స్థాయి అయిన 6 శాతాన్ని మించే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. యెస్‌ బ్యాంక్‌ తన నివేదికలో డిసెంబరు, ఫిబ్రవరి సమీక్షల్లో 25 బేసిస్‌ పాయింట్ల చొప్పున పెంపు ఉంటుందని అంచనా వేసింది. ప్రతికూల పరిస్థితులు నెలకొంటే ఏప్రిల్‌లోనూ మరోసారి వడ్డీరేటు పెంపు ఉండవచ్చని హెచ్చరించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్