మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏకగ్రీవ నిర్ణయం నిజమేనా?

6 గంటల క్రితం

ఏకగ్రీవ నిర్ణయం నిజమేనా?
- ఇసిఐపై అఫిడవిట్‌‌లో ప్రశ్నల వర్షం
- ఎస్ఐఆర్‌‌పై ఇసిఐని 48 ప్రశ్నలు అడిగేందుకు అనుమతి కోరిన ఇండియా బ్లాక్‌
- సుప్రీంను ఆశ్రయించిన ప్రతిపక్షాలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 10:56 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- ఇసిఐపై అఫిడవిట్‌‌లో ప్రశ్నల వర్షం

- ఎస్ఐఆర్‌‌పై ఇసిఐని 48 ప్రశ్నలు అడిగేందుకు అనుమతి కోరిన ఇండియా బ్లాక్‌

- సుప్రీంను ఆశ్రయించిన ప్రతిపక్షాలు

​న్యూఢిల్లీ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) నిర్ణయాల ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఇసిఐ) 48 ప్రశ్నలు అడిగేందుకు అనుమతించాలని కోరుతూ ఇండియా బ్లాక్‌ నేతలు సుప్రీంకోర్టులో ‌పిటిషన్‌ దాఖలు చేశారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు ఇందులో పిటిషనర్లుగా ఉన్నారు. ఎస్ఐఆర్‌కు సంబంధించిన అన్ని నిర్ణయాలనూ ఏకగ్రీవంగా తీసుకున్నామని ఇసిఐ తన కౌంటర్ అఫిడవిట్‌లో చెప్పింది. ఆ అఫిడవిట్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి), ఇద్దరు ఎన్నికల కమిషనర్లు నిజంగా ఆమోదించారా అన్నది ప్రశ్నల్లో ప్రధానమైనది.

​అఫిడవిట్ ఆమోదంపై ప్రశ్నలు

​ ఇసిఐ గత నెల 26న దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ ఏకగ్రీవ నిర్ణయాలు, ఆమోదాలపై ఆధారపడిందని, అయితే వాటికి సంబంధించిన తేదీలు, ఫైల్ నోటింగ్‌లు, రికార్డులు, నిర్ణయ ప్రక్రియ వివరాలు వెల్లడించలేదని పిటిషనర్లు వాదించారు. డిప్యూటీ ఎన్నికల కమిషనర్ భాను ప్రకాష్ యేతురు దాఖలు చేసిన ఈ అఫిడవిట్‌ను సిఇసి జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఆమోదించారా? అని వారు ప్రశ్నించారు. ఆ ఆమోదం సమావేశంలో ఇచ్చారా, ఫైల్ సర్క్యులేషన్ ద్వారానా, లేక ఎలక్ట్రానిక్ సమాచారం ద్వారానా చెప్పాలని కోరారు. ముగ్గురు సభ్యులూ ఏ తేదీల్లో ఆమోదించారో తెలిపే రికార్డులూ కావాలన్నారు. ఎస్ఐఆర్ నిర్ణయాలు, ఇసిఐనెట్, ఫారం 6, అప్పీళ్ల దాఖలుకు సంబంధించి ఎన్నికల కమిషనర్లు నమోదు చేసిన అభ్యంతరాలు, అసమ్మతి, సందేహాల వివరాలను పిటిషనర్లు అడిగారు. 2025 ఫిబ్రవరి 19 నుంచి 2026 అక్టోబర్ 26 మధ్య ఎన్ని సందర్భాల్లో వారు లిఖితపూర్వకంగా అభ్యంతరం లేదా అసమ్మతి తెలిపారో చెప్పాలని కోరారు. ఆ నిర్ణయాలు ఏకగ్రీవంగా జరిగాయా, మెజారిటీతోనా అన్నది అధికారిక రికార్డుల ఆధారంగా వెల్లడించాలన్నారు.

2025 జూన్ 24 ఉత్తర్వులో దేశమంతటా ఎస్ఐఆర్ ప్రారంభించాలని కమిషన్ నిర్ణయించినట్లు ఉంది. అయితే సమాచార హక్కు చట్టం కింద ఇసిఐ మొదటి అప్పీలేట్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులో, 2025లో దేశవ్యాప్త ఎస్ఐఆర్ ప్రారంభించే నిర్ణయం కమిషన్ తీసుకోలేదని పేర్కొన్నట్లు సమాచారం. ఈ వైరుధ్యానికి వివరణ ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. అలాంటి నిర్ణయానికి సంబంధించిన సమాచారం లేదని 2025 ఆగస్టు 27న కేంద్ర ప్రజా సమాచార అధికారి చెప్పే నాటికి సంబంధిత నిర్ణయ ఫైల్ ఉందా? అని కూడా ప్రశ్నించారు. అలాగే ఆన్‌లైన్ ఫారం 6 దరఖాస్తు పేజీలో డిక్లరేషన్ చేర్చడంపై పిటిషనర్లు వివరాలు కోరారు. దాన్ని ఎవరు ప్రవేశపెట్టారు, ఎప్పుడు చేశారు, కమిషన్ ఆమోదం ఉందా? అని అడిగారు. ఏ సభ్యుడైనా అభ్యంతరం తెలిపారా, ఈ డిక్లరేషన్ లేదా మ్యాపింగ్ సంబంధిత నిబంధనల కారణంగా ఎన్ని ఫారం 6 దరఖాస్తులు సమర్పించారు, తిరస్కరించారు, పెండింగ్‌లో ఉంచారు, ప్రాసెస్ చేయకుండా వదిలేశారు అనే సంఖ్యలూ అడిగారు. ముసాయిదా, తుది ఓటర్ల జాబితాల్లో పేర్లు చేరని ఓటర్ల రాష్ట్రాల వారీ, కేంద్రపాలిత ప్రాంతాల వారీ గణాంకాలను, మరణం, వలస, గైర్హాజరు, డూప్లికేషన్, అనర్హత వంటి కారణాలతో సహా వెల్లడించాలని కోరారు. ఫారం 7 అభ్యంతరాల వివరాలూ అడిగారు. వ్యక్తిగత అభ్యంతరదారులు లేదా బూత్ లెవల్ ఏజెంట్లు ఎన్ని దాఖలు చేశారు, తప్పుడు లేదా అస్తిత్వంలో లేని వ్యక్తుల ఉదంతాలు ఎన్ని, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31 కింద ఏ చర్యలు తీసుకున్నారన్నది చెప్పాలన్నారు. అలాగే, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఇఆర్‌ఒ) ఉత్తర్వు లేకుండా, బల్క్, సిస్టమ్ స్థాయి, డీ-డూప్లికేషన్ లేదా డేటా మైగ్రేషన్ ప్రక్రియల ద్వారా ఓటర్ల జాబితాలో ఏదైనా నమోదును చేర్చారా, తొలగించారా, మార్చారా అని పిటిషనర్లు అడిగారు. అలా జరిగి ఉంటే వివరాలు ఇవ్వాలన్నారు. ఒకసారి తొలగించిన నమోదును పునరుద్ధరించే సౌకర్యం ఇసిఐనెట్‌లో ఇఆర్ఒలకు ఉందా అని కూడా ప్రశ్నించారు.

​ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు సౌగతా రాయ్ (తృణమూల్ కాంగ్రెస్), అఖిలేష్ యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ), తేజస్వి ప్రసాద్ యాదవ్ (ఆర్‌‌జెడి), సంజయ్ రౌత్ (శివసేన యుబిటి), ఎంఏ బేబీ (సిపిఎం), డి రాజా (సిపిఐ), మహువా మాఝీ (జెఎంఎం), సుప్రియా సూలే (ఎన్‌‌సిపి-శరద్ పవార్), ఇటి మహమ్మద్ బషీర్ (ఐయుఎంఎల్) పిటిషనర్లలో ఉన్నారు. విసికె అధ్యక్షులు తోల్ తిరుమావళవన్, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపి సజ్జాద్ అహ్మద్ కిచ్లూ తర్వాత ఈ పిటిషన్‌లో చేరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్