- వందేళ్ల పాత ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
ప్రతాప్‌గఢ్ : ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా వందేళ్ల నాటి ఇల్లు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందగా, మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషాద ఘటన గురువారం తెల్లవారుజామున కోత్వాలి పరిధిలోని మహులి గ్రామంలో చోటుచేసుకుంది. మృతులను ప్రమోద్ శ్రీవాస్తవ, ఆయన భార్య రీటా శ్రీవాస్తవ, కుమారుడు నితిన్ శ్రీవాస్తవ, కోడలు మాధురి శ్రీవాస్తవ, మనవలు మాధవ్, అద్విక్‌లుగా గుర్తించారు. కుటుంబ సభ్యుడు అమన్ శ్రీవాస్తవ (28) ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గంటల తరబడి శ్రమించి శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించగా, ఆరుగురు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రాణాలతో బయటపడిన అమన్‌కు చికిత్స కొనసాగుతోంది. అధికారుల వివరాల ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంట్లో నిద్రలో ఉన్నారు. తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో కురిసిన భారీ వర్షాలకు వందేళ్ల పాత, శిథిలావస్థలో ఉన్న ఇల్లు ఒక్కసారిగా కూలిపోయింది. పెద్ద శబ్దం రావడంతో గ్రామస్థులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ విషాద ఘటనతో మహులి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టగా, బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.








కామెంట్‌లు (0)