న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం జంతర్‌మంతర్ పేరును ‘నరేంద్ర మోడీ స్క్వేర్’ లేదా ‘చౌక్’ అని మర్చి ఉండాల్సిందని సిపిఐ(యం) ఎంపి జాన్ బ్రిట్టాస్ విమర్శించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశం జాబితా నుండి తొలగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతర్ మంతర్ పేరును నరేంద్ర మోడీ స్క్వేర్ లేదా చౌక్ అని మార్చాల్సిందని, అప్పుడు ఎవరూ ఆప్రాంతం వైపు కన్నెత్తి చూసే వారు కాదని అన్నారు. తాన పట్ల, పలువురు సీనియర్ సిపిఐ(యం) నేతల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు తనను బలవంతంగా లాగారని, ఈడ్చుకు వెళ్లారని, అనంతరం ఒక వ్యాన్‌లో పడేశారని అన్నారు. ఆ అనూహ్య ఘటనపై తాను షాక్‌కు గురయ్యానని, అటువంటి పరిస్థితిని ఊహించలేదని అన్నారు. ఢిల్లీ బారికేడ్ల నగరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎవరైనా, ఎక్కడికైనా నిరభ్యంతరంగా వెళ్లే అవకాశం ఉండేదని, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా పసుపురంగు బారికేడ్స్ ఆహ్వానం పలుకుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్య యుతంగా పాలన లేదని, అలాగే పారదర్శకంగా నిర్వహించే ఎన్నికలు లేవని, బలమైన రాజ్యాంగ సంస్థలు లేవని అన్నారు. తాము ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటున్నామని అన్నారు. ప్రస్తుతం జంతర్‌మంతర్‌ను నిరసన ప్రదేశం జాబితా నుండి తొలగించారని, వాస్తవానికి ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని అన్నారు. జంతర్‌మంతర్‌ను తొలగించడం కన్నా అత్యుత్తమ ఐడియా ఏమిటంటే .. ఆ ప్రాంతానికి జంతర్‌మంతర్ బదులు నరేంద్ర మోడీ స్క్వేర్ అని పేరు మార్చాలని అన్నారు. నిరసన ప్రదర్శన చేపట్టాం కనుక తమను బలవంతంగా ఆ ప్రాంతం నుండి ఢిల్లీ పోలీసులు తరలించారని అన్నారు. కానీ సీనియర్ పొలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్ పట్ల వ్యవహరించిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పినరయి విజయన్ వయస్సు 82 సంవత్సరాలు. పదేళ్లు కేరళం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారని, ఆయనను కూడా బొలెరోలో తరలించారని అన్నారు. మూడున్నర గంటల పాటు ఎక్కడా ఆపకుండా ఢిల్లీ రహదారులపై తిప్పారని అన్నారు. దాబా లేదా మరేదైనా ప్రాంతంలో ఆపాలని, కొంచెం ఆహారమైనా అందించేలా చూడాలని చివరకు తాము పోలీసులను బతిమాలానని జాన్ బ్రిట్టాస్ చెప్పారు. కరోల్ బాగ్ సహా పలు ప్రాంతాల్లో బోలెరోను తిప్పుతూనే ఉన్నారని, మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి జంతర్ మంతర్ సమీపంలోని మందిర్బాగ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారని అన్నారు. ఆ తర్వాత విజయన్‌కు కేవలం మూడు చపాతీలు ఇచ్చారని అన్నారు. తమ హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయని, అందుకే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)కి లేఖ రాశానని అన్నారు. సర్, సిఇసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు చేపడతామని, రెండవది ఆందోళన చేపడతామని అన్నారు. మమతా బెనర్జీ, డిఎంకె సహా ఇండియా బ్లాక్ నేతలంతా ఐక్యంగా పోరాడతామని అన్నారు.
జంతర్ మంతర్ పేరును ‘నరేంద్ర మోడీ స్వ్కేర్’గా మార్చాల్సింది : జాన్ బ్రిట్టాస్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 14, 2026, 03:53 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)