- చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సూక్తులు
ఇండోర్ : న్యాయం ప్రజలకు పూర్తిగా, సమర్ధవంతంగా అందుబాటులో వుండాలంటే చర్చలు, గౌరవం, అందరినీ కలుపుకుని పోవడమనేది అత్యంత కీలకమని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ శనివారం పేర్కొన్నారు. లీగల్ ఎయిడ్ లక్ష్యమంటే కేసులను కేవలం పరిష్కరించడమే కాదు, ప్రజల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించేలా చూడడం కూడా ముఖ్యమని అన్నారు. ఇండోర్‌లో నల్సా (నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ) పశ్చిమ జోన్ ప్రాంతీయ సమావేశంలో సూర్యకాంత్ ప్రసంగించారు. చర్చల ద్వారానే న్యాయం అందుబాటులోకి వస్తుందని అన్నారు. చర్చలతోటే న్యాయం అందడం ప్రారంభమవుతుంది, ప్రజలెదుర్కొనే నిర్దిష్ట సమస్యలకు తగినట్లుగా పరిష్కారాలు వారికి అందాలని అన్నారు. భిన్న వర్గాలకు చెందిన కమ్యూనిటనీల ఇబ్బందులు, సమస్యలు వారి మాతృభాషలోనే వినాలని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. లీగల్ సర్వీసెస్ అథికారులతో పనిచేసే వలంటీర్లు కూడా జ్యుడీషియల్ ఆర్మీలో భాగమేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాలను కింది స్థాయి వరకు తీసుకెళ్ళడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అందరినీ కలుపుకుని పోతూ, గౌరవాన్ని నిలబెట్టేలా బాధితులకు న్యాయం అందించడంలో సాయపడాలని ఆయన వలంటీర్లను కోరారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, సుప్రీం, హైకోర్టుల న్యాయమూర్తులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆధునిక సాంకేతికత వల్ల న్యాయ వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇ ఫైలింగ్, డిజిటల్ రికార్డులు, వన్ డేటా-వన్ కేస్ వైఖరి, ఆన్‌లైన్ విచారణనలు, ఆధునిక జ్యుడీషియల్ నిర్వహణలతో మొత్తంగా న్యాయ వ్యవస్థ తీవ్రమైన మార్పులకు లోనవుతోందని పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)