శనివారం, 31 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కర్ణాటకలో చెరకు రైతుల ఆందోళన ఉధృతం.. పలు రహదారుల దిగ్భంధం

2 గంటల క్రితం

Sugarcane growers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026, 01:07 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

బెంగళూరు : చెరకు కొనుగోలు ధరను పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఉత్తర కర్ణాటకలో చెరకు రైతులు ఆందోళనను ఉధృతం చేశారు. చెరకు టన్నుకు రూ.5,500 ధర నిర్ణయించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం పలు ప్రాంతాల్లో రహదారులను దిగ్బంధించారు. బెళగావి బస్‌స్టాండ్‌ వద్ద బస్సుల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ధార్వాడ్‌లోని నిగడి గ్రామంలో రైతులు రహదారిపై బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయపుర, బాగల్‌కోట జిల్లాల్లోనూ ఆందోళనలు కొనసాగాయి. చెరకు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ కర్ణాటక రాజ్య రైతు సంఘం, హసిరు సేన గౌరవాధ్యక్షుడు శశికాంత్‌ గురూజీ రాష్ట్రవ్యాప్త స్వచ్ఛంద బంద్‌కు పిలుపునిచ్చారు. రైతుల పోరాటానికి మద్దతుగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని కోరారు. రైతులకు సినీ పరిశ్రమ కూడా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే సినిమా థియేటర్లను, సినిమాలను బహిష్కరించాలని రైతాంగానికి పిలుపునిచ్చారు. పాలు, కూరగాయలు సహా నిత్యావసర వస్తువుల అమ్మకాలను నిలిపివేసి బంద్‌కు మద్దతు తెలపాలని రైతులను కోరారు. చెరకు రైతులు తమ పంటకు లాభదాయకమైన ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.


చెరకు సేకరణకు టన్నుకు రూ.5,500 చెల్లించాలని, ఫెయిర్‌ అండ్‌ రెమ్యూనరేటివ్‌ ప్రైస్‌ (ఎఫ్‌ఆర్‌పీ) నిర్ధారణకు ప్రాథమిక రికవరీ శాతాన్ని 9.5 శాతానికి పునరుద్ధరించాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఇథనాల్‌ విధానాన్ని సమీక్షించాలని కూడా డిమాండ్‌ చేస్తున్నారు. జాతీయ రైతుల కమిషన్‌ సిఫార్సు చేసిన ‘సి2+50 శాతం’ సూత్రం ప్రకారం చెరకు ధరను నిర్ణయించాలని కోరుతున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని, చక్కెర కర్మాగారాల యజమానులతో చర్చించి పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనేక చక్కెర కర్మాగారాలు రాజకీయ నేతల ఆధీనంలో ఉన్నాయని, రైతులకు గిట్టుబాటు ధర లభించకుండా వారు అడ్డుకుంటున్నారని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ప్రధాని మోడీకి డి.కె. శివకుమార్‌ లేఖ

చెరకు రైతుల ఆందోళనను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌ కోరారు. చెరకు రైతుల డిమాండ్లపై, ముఖ్యంగా చక్కెర కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) సవరణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని శుక్రవారం ప్రధాని మోడీ, కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీకి లేఖ రాశారు. ప్రస్తుత ఆందోళనలకు ముగింపు పలికి, చక్కెర కర్మాగారాల్లో చెరకు క్రషింగ్‌ కార్యకలాపాలు సజావుగా ప్రారంభమయ్యేలా చూడాలని కోరారు. జాతీయ రైతుల కమిషన్‌ సిఫార్సు చేసిన ‘సి2+50 శాతం’ సూత్రం ప్రకారం చెరకు ధర నిర్ణయించడం, ఎఫ్‌ఆర్‌పీకి ప్రాథమిక రికవరీ శాతాన్ని తగ్గించడం వంటి ప్రధాన డిమాండ్లు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని శివకుమార్‌ తన లేఖలో పేర్కొన్నారు. 2019 ఫిబ్రవరి 14 నుంచి చక్కెర ఎంఎస్‌పీ కిలోకు రూ.31 వద్దే కొనసాగుతోందని, ఇదే సమయంలో చెరకు ఎఫ్‌ఆర్‌పీ టన్నుకు రూ.2,750 నుంచి రూ.3,650కు పెరిగిందని శివకుమార్‌ గుర్తుచేశారు. ప్రస్తుతం చక్కెర కిలో సుమారు రూ.45కు విక్రయిస్తున్నందున, ఎంఎస్‌పీని సవరించడం వల్ల వినియోగదారులపై అదనపు భారం పడకుండానే రైతులకు చెల్లింపులు అందేలా చేయవచ్చని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్