ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జంతర్ మంతర్ వద్ద నిరసన విజయవంతంగా ముగియడంతో, వామపక్ష చురుకైన భాగస్వామ్యం గురించి కూడా చర్చ జరుగుతోంది. ఎస్ఎఫ్ఐతో పాటు వివిధ విద్యార్థి, యువజన సంఘాలు, సిపిఎంతో సహా అనేక వామపక్ష పార్టీలు ఈ ఆందోళనను ఆరంభం నుంచి చివరి వరకు కొనసాగించాయి. సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి, పార్టీ సీనియర్ నాయకులు బృందా కరత్, సుభాషిణీ అలీ, పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ అరుణ్ కుమార్, అశోక్ దావలే, విజూ కృష్ణన్, మరియం దావలే, లోక్‌సభ నాయకుడు కె. రాధాకృష్ణన్, రాజ్యసభ నాయకులు జాన్ బ్రిట్టాస్, ఇతర వామపక్ష ఎంపిలతో సహా కీలక నాయకులు నిరసన ప్రదేశానికి స్వయంగా చేరుకుని మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, జాన్ వెస్లీ, ఎండి సలీం, కేంద్ర కమిటీ సభ్యులు థామస్ ఐజాక్, విక్రమ్ సింగ్ అనేక మంది తమ సంఘీభావం తెలిపారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం, నిరసనకారులు జాన్ బ్రిట్టాస్‌తో సహా వామపక్ష నాయకులకు కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. నీట్ పేపర్ లీక్ తరువాత, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో ఎస్ఎఫ్ఐయే ముందుగా నిరసనలు ప్రారంభించింది. విద్యా మంత్రిత్వ శాఖ ఉన్న శాస్త్రి భవన్ వైపు ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఆదర్శ్ ఎం. సాజి, సంయుక్త కార్యదర్శి ఐషే ఘోష్ నేతృత్వంలో జరిగిన మార్చ్‌పై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను, కార్యకర్తలను వీధుల గుండా ఈడ్చుకెళ్లారు. ఆ తర్వాత, వారిని అదుపులోకి తీసుకుంది. జంతర్ మంతర్ వద్ద జరిగిన సిజెపి ఆందోళనలో ఎస్ఎఫ్ఐ కూడా మొదటి నుంచీ చురుకుగా పాల్గొంది. ఎస్ఎఫ్ఐకి మద్దతుగా డివైఎఫ్ఐ కూడా వచ్చింది. ఎఐఎస్ఎఫ్, ఎఐఎస్ఎ వంటి ఇతర వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు కూడా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపాయి. నిరసన ప్రదేశంలో అంబేద్కర్, భగత్ సింగ్, చే గువేరాల చిత్రాలను ప్రదర్శించారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐల జెండాలు రెపరెపలాడాయి.
సిజెపి ఆందోళనల ప్రారంభంలో చెప్పుకోదగ్గ భాగస్వామ్యం లేకపోవడం అభిజిత్ దీప్కేతో సహా దాని కార్యకర్తలను నిరాశపరిచింది. ఈ దశలో కూడా, వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలే సమ్మె స్ఫూర్తిని నిలబెట్టాయి. వామపక్ష సంస్థలే స్వయంగా సమ్మెకు సైద్ధాంతిక బలాన్ని చేకూర్చాయి. కాంగ్రెస్ సమ్మెకు పూర్తిగా వెన్నుపోటు పొడిచినప్పుడు, ఎంఏ బేబీతో సహా సిపిఎం నాయకులు సంఘీభావంగా ముందుకు రావడం సిజెపికి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. అలాగే, సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షలోనూ వామపక్ష సంఘాలు పాల్గొన్నాయి. ఎస్ఎఫ్ఐ నాయకులు ఆదర్శ్, ఐషి ఘోష్, ఎఐఎస్ఎ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నెల 20న పార్లమెంట్ మార్చ్ అనంతరం చర్చలకు ప్రభుత్వం అంగీకరించడంతో విద్యార్థి నాయకులు తమ నిరాహార దీక్షను విరమించారు.








కామెంట్‌లు (0)