- ఢిల్లీ సదస్సులో నేతల పిలుపు
- లౌకిక భారత భవిష్యత్తుకు ముప్పు: ఎంఎ బేబీ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశం కోసం వామపక్ష, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యత అవసరమని జాతీయ సదస్సులో వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. దేశంలో వామపక్ష ఐక్యతను బలోపేతం చేయడంతోపాటు విస్తృత ప్రజాస్వామ్య శక్తుల ఐక్య కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాల్సిన అవశ్యకతపై శనివారం నాడిక్కడ కానిస్టిట్యూషన్ క్లబ్‌లో ‘దేశం కోసం వామపక్ష, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యత’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. వివిధ వామపక్ష, కమ్యూనిస్టు పార్టీల నాయకులు పాల్గొని దేశం ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక సవాళ్లపై చర్చించారు.
వామపక్ష ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతా వేదిక (యుఎల్‌డిఎఫ్) కన్వీనర్, జస్టిస్ బి చంద్రకుమార్ అధ్యక్షతన జరిగిన సదస్సులో సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి జి దేవరాజన్, ఆర్ఎస్‌పి ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య, సిపిఐ(ఎంఎల్) కేంద్ర కమిటీ సభ్యుడు రాజీవ్ దిమ్రి తదితరులు ప్రసంగించారు. నయా ఉదారవాద ఆర్థిక విధానాలు కార్మికులు, రైతులు, మహిళలు, యువత తదితర వర్గాల హక్కులపై దాడిని తీవ్రతరం చేస్తున్నాయని, ఆర్ఎస్ఎస్-బిజెపి విభజన రాజకీయాలు దేశ లౌకిక, ప్రజాస్వామ్య పునాదులను దెబ్బతీస్తున్నాయని సదస్సు అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల్లో వామపక్ష ఐక్యత కేవలం ఆకాంక్ష మాత్రమే కాదని, అత్యవసరమని పేర్కొంది. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులన్నీ ఐక్యంగా, దృఢ సంకల్పంతో పోరాడాలని పిలుపునిచ్చింది. కమ్యూనిస్టు ఐక్యతను ముందుకు తీసుకెళ్లడం, వామపక్ష శక్తుల సమీకరణను బలోపేతం చేయడం, ప్రజల హక్కుల పరిరక్షణకు విస్తృత ఐక్య ఉద్యమాన్ని నిర్మించాలని సదస్సు పునరుద్ఘాటించింది. భారత గణతంత్ర దేశ ప్రజాస్వామ్య, లౌకిక, సమాఖ్య స్వరూపాన్ని కాపాడేందుకు ఐక్య పోరాటాలను విస్తరించాలని తీర్మానించింది.
వామపక్ష, ప్రజాస్వామ్య పార్టీలు ఐక్యంగా పోరాడాలి: ఎంఎ బేబీ
దేశం ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితులను తిప్పికొట్టేందుకు, దేశ లౌకిక, ప్రజాస్వామ్య భవిష్యత్తు కోసం వామపక్ష, ప్రజాస్వామ్య పార్టీలు ఐక్యంగా పోరాడాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ పిలుపునిచ్చారు. ఐక్యంగా ముందుకు సాగడంలో విఫలమైతే లౌకిక, ప్రజాస్వామ్య భారత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఫాసిస్టు భావజాలంతో కూడిన ఆర్ఎస్ఎస్ దేశాన్ని నియంత్రిస్తోందని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటును సమావేశపరిచిందని, వర్షాకాల సమావేశాలను అధికారికంగా ముగించకుండా, రాష్ట్రపతికి సమాచారం ఇవ్వకుండా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హమన్నారు. ప్రశాంతంగా నిరసనలు తెలిపే జంతర్‌మంతర్‌లోనూ కేంద్ర ప్రభుత్వం ఆందోళనలకు ఆంక్షలు విధించిందని, ప్రజా ఉద్యమాలకు వేదికలైన జంతర్‌మంతర్ సహా ఇతర నిరసన స్థలాలను తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ వ్యవహారంపై మూడు కమ్యూనిస్టు పార్టీల ప్రధాన కార్యదర్శులు సిపిఎం కేంద్ర కార్యాలయం ఎకెజి భవన్‌లో సమావేశమయ్యారని తెలిపారు. ఎన్‌డిఎలో లేని పార్టీలన్నింటికీ లేఖలు రాసి ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చామన్నారు. జంతర్‌మంతర్‌లో విద్యార్థులు నిర్వహించిన ఆందోళన విజయవంతమైందని, విద్యార్థి, యువజన సంఘాల పాత్ర కీలకమైందన్నారు. ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకెళ్లడంలో, కొత్త తరంతో అనుసంధానం కావడంలో సిజెపి ముఖ్యమైన పాత్ర పోషించిందన్నారు. వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులు ప్రజలతో, యువతతో బలమైన సంబంధాలు ఏర్పరచుకోవాలని సూచించారు. మూస పద్ధతులు అనుసరించకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలతో మమేకం కావాలని అన్నారు.








కామెంట్‌లు (0)