- మహిళా రిజర్వేషన్లకు మద్దతు, స్థానాల పెంపునకు వ్యతిరేకం
- ఇండియా బ్లాక్ స్పష్టీకరణ
- రాష్ట్రాల వారీ పంపిణీని మరో 25 ఏళ్లు కొనసాగించాలని డిమాండ్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో: లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఇండియా బ్లాక్ వ్యతిరేకించింది. లోక్‌సభ ప్రస్తుత స్థానాల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను ప్రస్తుత స్థానాల్లోనే అమలు చేయాలని, రాష్ట్రాల వారీగా లోక్‌సభ స్థానాల పంపిణీని మరో 25 ఏళ్లపాటు కొనసాగించాలని డిమాండ్ చేసింది. శనివారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఇండియా బ్లాక్ నేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, టిఎంసి నేత అభిషేక్ బెనర్జీ, డెరెక్ ఓబ్రెయిన్, ఆర్‌జెడి నేతలు మనోజ్ ఝా, అభరు కుష్వాహా, సిపిఎం నేత ఎఎ రహీం, సిపిఐ నేత పి.సంతోష్ కుమార్, ఐయుఎంఎల్ నేత మహ్మద్ బషీర్, ఆర్ఎస్‌పి ఎంపి ఎన్‌కె ప్రేమ్ చంద్రన్, ఇండిపెండెంట్ ఎంపి కపిల్ సిబల్, తదితర పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. డీలిమిటేషన్ పేరుతో లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచడం, మహిళా రిజర్వేషన్లను దానితో ముడిపెట్టడం సరికాదని ప్రతిపక్షాలు అభిప్రాయపడ్డాయి. మహిళా రిజర్వేషన్లకు ప్రతిపక్షాలు వ్యతిరేకం కాదని, వాటిని డీలిమిటేషన్‌తో ముడిపెట్టకుండా అమలు చేయాలని స్పష్టం చేసింది.
డీలిమిటేషన్‌తో ఎస్‌సి, ఎస్‌టిలకు అన్యాయం : ఖర్గే
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లు ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. లోక్‌సభ స్థానాలను 850కి పెంచడంతో అధికారాన్ని శాశ్వతంగా కేంద్రీకరించుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోందన్నారు. ఈ బిల్లు ఎస్‌సి, ఎస్‌టిల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇండియా బ్లాక్ నేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లును ఉమ్మడిగా వ్యతిరేకించాలని కూటమి నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకుని రాజ్యాంగాన్ని మార్చే అవకాశం పాలకులకు లభిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచి, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ చేతుల్లోనే అధికారం శాశ్వతంగా ఉండేలా చేయాలన్నది వారి లక్ష్యమని విమర్శించారు. డీలిమిటేషన్ బిల్లులో ఎస్‌సి, ఎస్‌టిల ప్రాతినిధ్యాన్ని వారి జనాభా పెరుగుదలకు అనుగుణంగా పెంచే అంశం లేదని ఖర్గే తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 330 ప్రకారం లోక్‌సభలో ఎస్‌సి, ఎస్‌టిలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఓటర్ల జాబితాల నుంచి కోట్లాది మంది పేర్లను తొలగించారనే ఆరోపణలు ఉన్న సంస్థకు డీలిమిటేషన్ బాధ్యతలు అప్పగించడం సరికాదన్నారు. అస్సాం, జమ్మూకాశ్మీర్‌లో గతంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో అధికార పార్టీకి అనుకూలంగా సీట్ల సరిహద్దులు, రిజర్వేషన్లను మార్చారని విమర్శించారు. అయితే, బిల్లును ఓడించేందుకు అన్ని ప్రయత్నాలూ చేయాలని ఇండియా బ్లాక్ సమావేశం నిర్ణయించింది. సభలో ప్రతి ఎంపి హాజరయ్యేలా చూడాలని, డిఎంకె, ఎన్‌సిపిలతో చర్చలు కొనసాగించి వాటి వైఖరిలో మార్పు తీసుకురావాలని నిర్ణయించింది. వామపక్ష పార్టీలతో సహా 11 పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. డిఎంకె, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బిజూ జనతాదళ్ (బిజెడి)లకు ఆహ్వానం పంపినప్పటికీ అవి సమావేశానికి హాజరుకాలేదు.








కామెంట్‌లు (0)