శుక్రవారం, 20 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

12 ఏళ్ల ఆర్థిక విధానాల వైఫల్యాన్ని మోడీయే అంగీకరించారు – ఎం.ఎ. బేబీ

8 గంటల క్రితం

12 ఏళ్ల ఆర్థిక విధానాల వైఫల్యాన్ని మోడీయే అంగీకరించారు – ఎం.ఎ. బేబీ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 05:52 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ:

గత 12 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల సంపూర్ణ వైఫల్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే స్వయంగా అంగీకరించారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ అన్నారు. ఫిక్కీ (FICCI) శతాబ్ది సదస్సులో మోడీ చేసిన ప్రసంగం ప్రభుత్వ ఆర్థిక విధానాలు విఫలమయ్యాయనడానికి స్పష్టమైన నిదర్శనమని పేర్కొన్నారు. భారీ పరిశ్రమలకు పన్ను రాయితీలు, ప్రయోజనాలు భారీగా కల్పించినప్పటికీ కార్మికుల వేతనాలు పెరగలేదని, నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదని ప్రధాని స్వయంగా ఒప్పుకున్నారని ఎం.ఎ. బేబీ ‘ఎక్స్’ (X) వేదికగా విమర్శించారు.



కార్పొరేట్ పన్నును చరిత్రలోనే అత్యల్ప స్థాయికి తగ్గించి, బడా పారిశ్రామికవేత్తలకు అనేక మినహాయింపులు ఇచ్చినా సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని ఆయన అన్నారు. స్వయంసమృద్ధి సాధించడంలో భారత్ పురోగతి సాధించలేదన్న మోడీ వ్యాఖ్యలు ‘ఆత్మనిర్భర్ భారత్’ పథకం డొల్లతనాన్ని బయటపెడుతున్నాయని వ్యాఖ్యానించారు. 2014లో ఘనంగా ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ పథకం తర్వాత దేశ స్థూల దేశీయోత్పత్తి (GDP)లో తయారీ రంగం వాటా పెరగడానికి బదులుగా తగ్గిందని బేబీ ఎత్తిచూపారు.


కార్పొరేట్లకు ఎన్ని ప్రయోజనాలు కల్పించినా వారి అత్యాశ తీరడం లేదన్న ప్రధాని వ్యాఖ్య ప్రసంగంలో అత్యంత కీలకమైనదని బేబీ పేర్కొన్నారు. అయితే, బ్రిటిష్ పాలన కాలం కంటే తీవ్రమైన స్థాయిలో దేశంలో ఆదాయం, సంపద కేంద్రీకృతం అయ్యాయన్న విషయాన్ని మోడీ చెప్పడం మర్చిపోయారని విమర్శించారు. వందేళ్ల క్రితం ఉన్నదానికంటే ఎక్కువ స్థాయిలో నేడు సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉందని, దేశభక్తి గురించి ఎన్ని గొప్ప ప్రసంగాలు చేసినా ఈ వర్గ వాస్తవాన్ని దాచలేరని స్పష్టం చేశారు.


నినాదాలు, ఆడంబరపు మాటలు ఆపి సొంత విధానాల వైఫల్యాన్ని ప్రధాని అంగీకరించాలని బేబీ డిమాండ్ చేశారు. నిజమైన స్వయంసమృద్ధి సాధించాలంటే ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలని, దేశీయ ఉత్పాదక సామర్థ్యాన్ని బలోపేతం చేయాలని సూచించారు. మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు కార్మికుల హక్కులను పరిరక్షించే చర్యలు చేపట్టాలని కోరారు. శ్రమజీవులు సృష్టించే సంపద ప్రయోజనం సమాజం మొత్తానికి అందే వాతావరణాన్ని కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.


మరిన్ని ఆర్థిక సంస్కరణల కోసం బడా పెట్టుబడిదారీ శక్తుల వద్ద సలహాలు కోరడం ఆపాలని హితవు పలికారు. కార్పొరేట్ల లాభాల కంటే ప్రజల సంక్షేమానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న పోరాటానికి, వేతనాల పెంపు, ఉపాధి డిమాండ్లతో సాగుతున్న ఆందోళనలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఎం.ఎ. బేబీ ప్రకటించారు. డిసెంబర్ 1 నుంచి 3 వరకు జరిగే కార్మికుల పార్లమెంట్ మార్చ్‌ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్