మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నో అవాస్తవాలను నా కుటుంబం చుట్టూ అల్లారు

7 గంటల క్రితం

ఎన్నో అవాస్తవాలను నా కుటుంబం చుట్టూ అల్లారు
- నా ఆత్మకథ పుస్తకానికి ప్రజల స్పందనపై చలించిపోయాను
- ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకావిష్కరణలో సోనియా గాంధీ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 10:06 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- నా ఆత్మకథ పుస్తకానికి ప్రజల స్పందనపై చలించిపోయాను

- ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకావిష్కరణలో సోనియా గాంధీ​

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తన కుటుంబం గురించి చెప్పడానికి తాను రాసిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం ఒక మార్గం అని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సిపిపి) చైర్మన్ సోనియా గాంధీ తెలిపారు. ‘తన అత్త ఇందిరా గాంధీ, భర్త రాజీవ్ గాంధీ, కొడుకు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంక వాద్రా... చివరకు నాతో పాటు నా కుటుంబంపై చాలా మంది రాసారు. కానీ అందులో నా కుటుంబం గురించి అవాస్తవాలను చెప్పారు. అబ్ధాలతో కుటుంబం చుట్టూ కథలు అల్లారు’ అని చెప్పారు. నిజానికి ఏమాత్రం సంబంధం లేని బాధపెట్టే మాటలు అన్నారని గుర్తు చేశారు. అప్పుడే తన భావాలు, తన కుటుంబం గురించి తనకు తెలిసిన విషయాలు బయటపెట్టడానికి ఈ ఆత్మకథ పుస్తకం ఒక మార్గం అని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

రాజకీయ ప్రస్థానంలో అనేక కీలక మలుపులు..

సోమవారం ఢిల్లీలో పుస్తక ప్రచురణకర్త సంస్థ హార్పర్ కాలిన్స్ ప్రతినిధి, రాహుల్, ప్రియాంకలతో కలిసి సోనియా గాంధీ తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకాన్ని అధికారికంగా ఆవిష్కరించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రతిపక్ష పార్టీల ఐక్యతను చాటే వేదికగా నిలిచింది. సోనియా గాంధీ తన జీవితంలోని వ్యక్తిగత అనుభవాలు, కుటుంబ నేపథ్యం, భారత్‌తో ఏర్పడిన అనుబంధం, రాజకీయ ప్రస్థానంలోని కీలక ఘట్టాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఇటలీలో బాల్యం నుంచి మొదలైన ఆమె జీవితం.. బ్రిటన్‌లో చదువుకునే రోజుల్లో రాజీవ్‌ గాంధీతో పరిచయం, ప్రేమ, వివాహం, భారత్‌కు రాక, నెహ్రూ, గాంధీ కుటుంబంతో అనుబంధం వంటి అనేక అంశాలను ఇందులో వివరించారు. అత్త ఇందిరా గాంధీ, భర్త రాజీవ్‌ గాంధీల హత్యలు తన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేశాయో కూడా ప్రస్తావించారు. తన గురించి ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయని, వాటిలో చాలా వరకు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు. అందుకే తన జీవితాన్ని, అనుభవాలను తన కోణంలో ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో పుస్తకం రాసినట్లు వెల్లడించారు. తన భర్త రాజీవ్‌ గాంధీ రాజకీయాల్లోకి రావడాన్ని మొదట తాను వ్యతిరేకించానని, రాజకీయాల్లోకి వస్తే ఆయనను కోల్పోతానేమోనని భయపడ్డానని తెలిపారు. రాజీవ్‌ ప్రధానమంత్రి అయినప్పుడు భద్రతా కారణాలతో రాహుల్‌, ప్రియాంకలను ఇంటి నుంచి బయటకు వెళ్లనిచ్చేవారు కాదని గుర్తుచేశారు. రాజీవ్‌ గాంధీ మరణం తర్వాత తాను పూర్తిగా కుంగిపోయానని, ఆ సమయంలో పిల్లలే తనకు అండగా నిలిచారని చెప్పారు. తొలుత పుస్తకం రాయడానికి సంకోచించినప్పటికీ, పాఠకుల నుంచి వస్తున్న స్పందన తనను ఎంతో కదిలించిందని ఆమె పేర్కొన్నారు.

ఇందిరా తేజోవంతమైన వ్యక్తి...

ఇందిరా గాంధీని చూసి అబ్బురపడ్డానని సోనియా గాంధీ గుర్తు చేసుకున్నారు. ఆమె తేజోవంతమైన వ్యక్తి అని, ఆమెను చూస్తే భయం వేసేదన్నారు. పుస్తకానికి పాఠకుల నుంచి లభిస్తున్న స్పందన పట్ల సోనియా గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ స్పందన తనను ఎంతో కదిలించిందని పేర్కొన్నారు. ‘ఈ పుస్తకానికి వచ్చిన స్పందన అద్బుతంగా ఉందని, ఈ విషయం తెలిసి చలించిపోయాను’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఐసిసి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ సీఎంలు... వరుసగా రేవంత్ రెడ్డి, డి కె శివ కుమార్, సుఖ్వీందర్ సింగ్ సుఖు, జోసెఫ్ విజయ్, హేమంత్ సోరెన్, ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్పరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్ధుల్లా, బిజెపి నేత అమరీందర్ సింగ్, యుపి మాజీ సిఎం అఖిలేష్ కుమార్, ఎన్‌‌సిపి ఎంపీ సుప్రియా సూలే, టిఎంసి నేత అభిషేక్ బెనర్జీ, ఇతర ఇండియా కూటమి నేతలు హాజరయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్