ప్యాసింజర్ రైలు వెళ్లిన 45 నిమిషాలకే విధ్వంసం, తప్పిన పెను ప్రమాదం
అనూప్‌గఢ్–సూరత్‌గఢ్ మార్గంలో రైళ్లు నిలిపివేత
శ్రీగంగానగర్ : భారత్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో భారీ పేలుడు కలకలం రేపింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాలో మంగళవారం రాత్రి రైల్వే ట్రాక్‌పై పేలుడు సంభవించి, పట్టాలు దెబ్బతిన్నాయి. ఓ ప్యాసింజర్ రైలు ఆ మార్గంలో వెళ్లిన కొద్దిసేపటికే ఈ పేలుడు జరగడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. దీంతో అనూప్‌గఢ్-సూరత్‌గఢ్ మార్గంలో రైళ్ల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
రైలు వెళ్లిన 45 నిమిషాలకే పేలుడు
అనూప్‌గఢ్ జంక్షన్ నుంచి ఓ ప్యాసింజర్ రైలు బయలుదేరిన సుమారు 45 నిమిషాల తర్వాత ఈ పేలుడు జరిగినట్లు అధికారులు గుర్తించారు. రైలు వెళ్లిన తర్వాత పేలుడు సంభవించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ప్రయాణికుల రైలును లక్ష్యంగా చేసుకుని విధ్వంసానికి కుట్ర పన్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాక్‌పై 50 జిబి పాయింట్ సమీపంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. ట్రాక్‌కు ఆధారంగా ఉన్న రెండు కాంక్రీట్ పిల్లర్లు దెబ్బతిన్నాయి. పేలుడు ధాటికి అక్కడ సుమారు రెండు అడుగుల లోతున గుంత ఏర్పడింది. భారీ శబ్దం వినిపించిందని సమీప గ్రామాల ప్రజలు తెలిపారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. యాంటీ టెర్రరిజం బృందాలు, బాంబు నిర్వీర్య దళాలు తనిఖీలు చేపట్టాయి. ఇటీవల ఇదే సరిహద్దు ప్రాంతంలోని శ్రీగంగానగర్ పరిసరాల్లో డ్రోన్ల ద్వారా జారవిడిచిన ఆయుధాలు, ఆర్డీఎక్స్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. తాజా పేలుడుకు ఆ వ్యవహారంతో సంబంధం ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. పేలుడుకు కారణాలు, దీని వెనుక ఎవరున్నారన్న అంశాలపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు జిల్లా ఎస్‌పి వెల్లడించారు.








కామెంట్‌లు (0)