అధికారం కోసం కుట్రలు సాగిస్తున్న బిజెపి
వ్యకాస బహిరంగ సభలో త్రిపుర మాజీ సిఎం మాణిక్ సర్కార్
ఐక్య పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపు
ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వ బిజెపి ప్రభుత్వం గ్రామీణ ప్రజల ఉపాధిని నిర్వీర్యం చేస్తోందని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ విమర్శించారు. వామపక్షాల ఒత్తిడితో గత యుపిఎ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్ఆర్ఇజిఎ) బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి క్రమ క్రమంగా బలహీనపరుస్తూ..ఇప్పుడు ఏకంగా రద్దు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభ ప్రారంభం సందర్భంగా మహబూబ్‌నగర్‌లోని ఎంబిసి గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో మాణిక్ సర్కార్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. దేశంలో అత్యంత పేదలు వ్యవసాయ కార్మికులనేనని, ప్రాథమిక అవసరాలను కూడా తీర్చుకోలేక అర్ధాకలి, పస్తులతో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని మాణిక్ సర్కార్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారి పక్షాన పోరాడుతున్నది ఎర్రజెండాయేనని తెలిపారు. గ్రామీణ పేదలు ఆత్మ గౌరవంతో జీవించడం ఇష్టం లేక ఆ చట్టాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసి విబి గ్రామ్ జీ పథకాన్ని తీసుకొచ్చిందని వివరించారు. దీంతో, వ్యవసాయ కార్మికులు మళ్లీ రోడ్డున పడాల్సిన, వలసలు పోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ప్రజల కష్టాలు కేంద్రంలో ఉన్న బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ సర్కార్‌కు పట్టడం లేదని, ఆ ప్రభుత్వానికి కార్పొరేట్లకు లాభాలు చేకూర్చడమే ప్రథమ ధ్యేయంగా మారిందని విమర్శించారు. అధికారం కోసం బిజెపి కుట్రలు చేస్తోందని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ విమర్శించారు. ప్రజాస్వామ్యంపైనా, రాజ్యాంగంపైనా, ప్రజల హక్కులపైనా దాడి చేస్తూ... విభజన, విద్వేష రాజకీయాలతో అధికారం... అవినీతి... ఇదే నీతి అన్నట్టుగా మోడీ సర్కారు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉపాధి రక్షణ కోసం వ్యవసాయ కార్మికులు ఐక్య పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
బిజెపి పెరగట్లేదు... కాంగ్రెస్ పెంచుతోంది...
చాలా రాష్ట్రాల్లో బిజెపి బలం పెరగలేదని, కాంగ్రెస్ పార్టీనే పెంచుతుందని మాణిక్ సర్కార్ అన్నారు. దానికి ప్రత్యక్ష ఉదహరణ త్రిపురనే అని తెలిపారు. త్రిపురలో 42 శాతంగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం బిజెపి ఓటు బ్యాంకుగా మారిందన్నారు. సిపిఎం ఐదు నుంచి ఏడు శాతం ఓటింగ్‌నే కోల్పోయిందని వివరించారు. అయితే, పార్టీ క్రమంగా పుంజుకుంటోందని తెలిపారు.
ఉపాధి చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి : బి.వెంకట్
గ్రామీణ పేదల బతుకులకు ఆశాదీపంగా ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని, విబి గ్రామ్‌జీ పథకాన్ని అమలు చేయొద్దని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు. 200 రోజులు పని కల్పించి రోజువారీ కూలి రూ.700 ఇవ్వాలని కోరారు. ఈ డిమాండ్లపై జులై ఒకటో తేదీన దేశంలోని అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల ఎదుట గ్రామీణ కార్మికులతో ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఎర్రజెండాదే భవిష్యత్తు : పి.మధు
దేశంలో ఎర్రజెండా పని అయిపోయిందని అంటున్న వారు ఒకసారి ఎర్రజెండా లేని భవిష్యతును ఊహించుకోవాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పూర్వ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీ ఎంపి పి.మధు అన్నారు. నిరంకుశ నైజాం పాలనకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటాల్లో ఎర్రజెండా పాత్ర అనిర్వచనీయమని పేర్కొన్నారు. కమ్యూనిస్టుల పోరాటాల ఫలితంగా ఈ ప్రాంతం నైజాం పాలన నుండి విముక్తి అయ్యిందన్న విషయం మరిచిపోలేమన్నారు.









కామెంట్‌లు (0)