- మొన్న భూ సేకరణ ఆర్డినెన్స్...నిన్న రైతు చట్టాలు...నేడు కేంద్ర మంత్రి రాజీనామా
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రజా ఉద్యమాలతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం వెనక్కితగ్గడం తప్పడం లేదు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న ఐదేళ్ల తరువాత, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తాజాగా మరో పోరాటానికి తలొగ్గింది. కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నేతృత్వంలోని విద్యార్థుల ఆందోళనలతో దిగివచ్చింది. విధానపరంగా అతిపెద్ద వెనుకడుగు వేసింది. నీట్ లీక్ వివాదంపై దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రమయ్యాయి. వీటితో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగడంతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చివరకు శనివారం రాజీనామా చేశారు. ప్రజా ఉద్యమాలతో ఒత్తిడి కారణంగా మోడీ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా మార్చుకోవడం ఇది మూడోసారి. ఈ ఉద్యమాల కారణంగా ఒక కేంద్ర మంత్రి తన పదవిని కోల్పోవడం ఇదే మొదటిసారి.
2015లో భూ సేకరణ చట్టంలో సవరణలకు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. భూ సేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం జరిగింది. రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల విస్తృత వేదిక భూమి అధికార్ ఆందోళన్ (బిబిఎ) ఆధ్వర్యంలో పోరాటాలు, ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. విధానపరంగా ఎన్‌డిఎ ప్రభుత్వం దిగిరావడం ఇదే తొలిసారి. 2020లో మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతుల విస్తృత వేదిక సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) ఆధ్వర్యంలో పోరాటం ఢిల్లీ పీఠాలను వణికించింది. ఏడాది పాటు నిర్విరామంగా ఢిల్లీ సరిహద్దుల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకుని రైతులు ఉద్యమించారు. చివరకు రైతుల ఆందోళనలతో ఎన్‌డిఎ ప్రభుత్వం దిగివచ్చింది. 2021 నవంబర్ 19న ప్రధాని మోడీ ప్రధాని మోడీ దేశానికి క్షమాపణ చెబుతూ మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. విధానపరంగా ఎన్‌డిఎ ప్రభుత్వం దిగిరావడం ఇది రెండోసారి.
ఇప్పుడు నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఈ, జెఈఈ అవకతవకలు వంటి విద్యా రంగ వైఫల్యాలపై కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఆధ్వర్యంలో సుధీర్ఘంగా విద్యార్థులు, యువత ఆందోళన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎ, ఎఐఎస్ఎఫ్, కెవైఎస్ తదితర విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థులు, యువత దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. దేశ పాలకులను ఈ ఉద్యమం గడగడలాడించింది. ఈ ఉద్యమానికి తలొగ్గి కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. విధానపరంగా ఎన్‌డిఎ ప్రభుత్వం దిగిరావడం ఇది మూడోసారి.
ఇవే కాకుండా 2014 నుంచి ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమాలు, రాజకీయ ఒత్తిడి, న్యాయస్థానాల జోక్యం లేదా ఎన్నికల పరిస్థితుల కారణంగా కొన్ని కీలక అంశాల్లో తన నిర్ణయాలను మార్చడం లేదా వెనక్కి తీసుకోవడం జరిగింది. 2024 యుపిఎస్‌సి రిజర్వేషన్ లేకుండా లాటరల్ ఎంట్రీ నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రతిపక్షాలు, సామాజిక సంస్థల నుంచి విమర్శల తరువాత ఆ ప్రక్రియను నిలిపివేయాలని కేంద్రం సూచించింది. వక్ఫ్ (సవరణ) బిల్లులో మార్పులు చేయాల్సి వచ్చింది. పార్లమెంటరీ కమిటీ పరిశీలన, వివిధ వర్గాల సూచనల తరువాత కొన్ని నిబంధనల్లో మార్పులు చేసింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు మొదటి ముసాయిదాపై తీవ్ర అభ్యంతరాలు రావడంతో దానిని ఉపసంహరించుకుని సవరించిన కొత్త బిల్లును తీసుకొచ్చింది. జిఎస్‌టి రేట్ల సవరణల్లో భాగంగా అనేక వస్తువులు, సేవలపై విధించిన జిఎస్‌టి రేట్లను వ్యాపార వర్గాలు, రాష్ట్రాల సూచనల మేరకు పలుమార్లు తగ్గించింది. 2021లో కోవిడ్-19 వ్యాక్సిన్ విధానంలో మార్పు చేయాల్సి వచ్చింది. ప్రారంభంలో రాష్ట్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులు కూడా నేరుగా వ్యాక్సిన్లు కొనుగోలు చేసే విధానం అమలు చేసింది. విమర్శలు, సుప్రీం కోర్టు జోక్యం అనంతరం కేంద్రం మళ్లీ ఎక్కువ భాగం వ్యాక్సిన్ కొనుగోళ్ల బాధ్యతను స్వీకరించింది. ఎన్‌ఆర్‌సి దేశవ్యాప్త అమలుపై వైఖరిని మార్చుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)తో పాటు దేశవ్యాప్త ఎన్ఆర్‌సిపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అనంతరం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త ఎన్ఆర్‌సి తక్షణ అమలు జరగదని పలుమార్లు స్పష్టం చేసింది. దీని తరువాత ఇటీవల కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్లలో "సంచార్ సాథీ" యాప్‌ను తప్పనిసరిగా ముందే ఇన్‌స్టాల్ చేసి ఇవ్వాలని జారీ చేసిన ఆదేశాన్ని వెనక్కి తీసుకుంది.
ఎనిమిదేళ్లలో ఇద్దరు మంత్రులు రాజీనామా
మోడీ సర్కార్ హయంలో గత ఎనిమిదేళ్లలో ఇద్దరు కేంద్ర విద్యా శాఖ మంత్రులు రాజీనామా చేశారు. విద్యార్థిలోకం నిరసనల ధాటికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం రాజీనామా చేశారు. గత ఎనిమిదేళ్లలో ఇలా పదవీకాలం మధ్యలోనే వైదొలిగిన ఏకైక కేంద్ర క్యాబినేట్ హోదా మంత్రి ప్రధానే కావడం విశేషం. దీనికి ముందు 2018లో విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్ అనూహ్యంగా రాజీనామా సమర్పించారు. 2016లో బాధ్యతలు చేపట్టిన అక్బర్.. అంతుకుముందు వార్త పత్రిక ఎడిటర్‌గా ఉన్న సమయంలో పలు మహిళలపై లైంగిక వేధింపులు పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. ఆయనకు వ్యతిరేకంగా మీటూ ఉద్యమం తీవ్రమవ్వడంతో అక్బర్ రాజీనామా చేయాల్సి వచ్చింది.








కామెంట్‌లు (0)