శనివారం, 12 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం

8 గంటల క్రితం

pm modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 12:23 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- మోడీ, పుతిన్‌
ద్వైపాక్షిక భేటీ

- శాంతి ప్రయత్నాల్లో సహకరిస్తామన్న మోడీ

న్యూఢిల్లీ : బ్రిక్స్‌ ‌సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్‌‌కు మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ‌శుక్రవారం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. దేశ రాజధానిలోని భారత మంటపం వేదికగా జరిగిన ఈ సమావేశంలో ఇరు దేశాధినేతలు వాణిజ్యం నుంచి రక్షణ దాకా, ఇంధనం నుంచి అంతర్జాతీయ శాంతి వరకూ కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే మోడీ - పుతిన్‌ కలవడం ఇది రెండోసారి కావడం విశేషం. గత వారం బిష్కేక్‌లో జరిగిన ఎస్‌సిఒ సదస్సు సందర్భంగా కూడా వీరిద్దరూ భేటీ అయ్యారు. 2024-25లో సుమారు 70 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఇరు దేశాల వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లాలని మోడీ, పుతిన్‌ నిర్ణయించారు. ఇందుకోసం రక్షణ, ఇంధనం, కీలక ఖనిజాల రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని అంగీకరించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు.

త్వరలో రష్యా పర్యటనకు మోడీ..

24వ భారత్‌-రష్యా వార్షిక సదస్సు కోసం రష్యాకు రావాల్సిందిగా పుతిన్‌ ప్రధాని మోడీని ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని మోడీ అంగీకరించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. పర్యటన తేదీలను తరువాత ఖరారు చేయనున్నారు. పశ్చిమాసియా, నల్ల సముద్రంలోని ఘర్షణలు సముద్ర జలాల వాణిజ్యం, భారత నావికుల భద్రతపై ప్రభావం చూపిన నేపథ్యంలో మోడీ, పుతిన్‌‌ పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చర్చలు, దౌత్యం ద్వారానే ఈ ఘర్షణలు పరిష్కారం కావాలని మోడీ పునరుద్ఘాటించారు. అవసరమైతే శాంతి ప్రయత్నాల్లో సహకరించ డానికి భారత్‌ ‌సిద్ధంగా వుందని మోడీ తెలిపారని ఆ ప్రకటన పేర్కొంది. ఇరు దేశాల మధ్య గల ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నాలు నిరంతరంగా కొనసాగాలని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారని విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. చర్యలు, దౌత్యం ద్వారానే ఉక్రెయిన్‌ ‌ఘర్షణలు పరిష్కరించుకోగలమని, అంతేకానీ కొన్ని దేశాలు రష్యాతో ఇంధన, లోహ లేదా ఎరువుల వాణిజ్యాన్ని నిలిపివేయడం ద్వారా పరిష్కరించుకోలేమని భారత్‌ ‌స్పష్టం చేసింది. రష్యా చమురుకు అతిపెద్ద కొనుగోలుదారు భారత్‌, చైనా దేశాలే. ఉక్రెయిన్‌‌తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలతో రష్యా చమురు కొనుగోలుపై వస్తున్న ఒత్తిళ్లను భారత్‌ ‌ప్రతిఘటిస్తోంది. విస్తారమైన తన జనాభా అవసరాలను తీర్చడానికి తమకు సురక్షితంగా, విశ్వసనీయమైన రీతిలో, అందుబాటు ధరల్లో ఇంధన సరఫరాలు అవసరమని స్పష్టం చేసింది.

పుతిన్‌‌కి పుస్తకం బహూకరణ..

పుతిన్‌‌తో భేటీ సందర్భంగా మోడీ తిరుక్కురుళ్‌ అనే రష్యన్‌ అనువాద పుస్తకాన్ని పుతిన్‌‌కు బహూకరించారు. ప్రేమ, దయ, నైతికత, సుపరిపాలన, మానవత్వం వంటి అనేక అంశాలతో సాగిన 1330 ద్విపదులు ఈ పుస్తకంలో వున్నాయి. ప్రముఖ తమిళ కవి, తత్వవేత్త తిరువళ్ళువార్‌ ‌రచించిన పుస్తకం ఇది. అనంతరం ఇరువురు నేతలు కలిసి భారత్‌-రష్యా పారిశ్రామిక ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఇందులో కృత్రిమ మేధ (ఎఐ), పౌర విమానయానం, రోదసీ పరిశోధన, అణు శాస్త్రం, హెవీ ఇంజనీరింగ్‌, గనుల తవ్వకాలు, బ్యాంకింగ్‌ రంగాలకు సంబంధించిన సాంకేతికతలను ప్రదర్శించారు. అటుపై భారత మంటపం సముదాయంలోనే జరుగుతున్న బిజినెస్‌ ఫోరం సమావేశాల్లో పాల్గొనేందుకు కలిసి తరలివెళ్లారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్