అమెరికా ‘మిస్టర్ సింగ్’ ప్రకటనపై కాంగ్రెస్ విమర్శలు
న్యూఢిల్లీ :భారతీయ ట్రక్ డైవర్లకు వ్యతిరేకంగా అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం జారీ చేసిన ప్రకటనను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఈ ప్రకటన భారతీయులందరికీ అవమానమని, మోడీ బలహీనమైన ప్రభుత్వమే ఇలాంటి ప్రకటనకు కారణమని విమర్శించింది. భారతదేశ ప్రయోజనాలను సమర్థిస్తూ.. ఈ ప్రకటనపై అమెరికాను మోడీ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించలేకపోతోందని, ఈ విషయంపై దేశ ప్రజలకు మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పేర్కొంది. అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం ఎక్స్‌లో చేసిన పోస్టర్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆ పోస్టర్‌పై తలపాగాతో ఉన్న వ్యక్తికి ఎదురుగా ఒక రోబో నిల్చొని.. ‘‘మిస్టర్ సింగ్.. మా రోడ్లను వదిలిపెట్టండి. మీకు డ్రైవింగ్ రాదు’’ అని హెచ్చరించినట్టుగా ఉంది. పైగా ‘‘మీ అంతట మీరుగా దేశాన్ని వీడండి .. లేదంటే పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని అధికారులు ఆ పోస్టర్‌పై పేర్కొన్నారు. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఎక్స్‌లో చేసిన పోస్టులో "డొనాల్డ్ ట్రంప్‌ను తన 'స్నేహితుడు' అని చెప్పుకునే ప్రధాని మోడీ హయాంలో అమెరికాలో భారతీయులు నిరంతర అవమానాలను ఎదుర్కొం టున్నా కేంద్రం మౌనంగా ఉంటుంది. 'అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తన అధికారిక ఖాతా నుంచి తీవ్ర అభ్యంతరకరమైన పోస్టర్ విడుదల చేసింది. ఇది కేవలం ఒక వ్యక్తికి లేదా ఒక సమూహానికి జరిగిన అవమానం కాదు.. భారతీయులందరికి జరిగిన అవమానం" అని పేర్కొన్నారు. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పోస్టర్‌ను హిందూ అమెరికన్ ఫౌండేషన్, సిఖ్ కోయలిషన్‌తో సహా అనేక సంఘాలు ఖండించాయి. ‘అమెరికా ప్రభుత్వం మమ్మల్ని శత్రువులుగా చిత్రీకరించినా, మేము సిక్కులుగా మా గుర్తింపును నిర్భయంగా కొనసాగిస్తాం" అని సిక్కు కోయలిషన్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.








కామెంట్‌లు (0)