ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

భారీ వర్షాలతో ముంబయి అతలాకుతలం

2 గంటల క్రితం

rains in mumbai
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 10:30 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- పలు విమానాల రద్దు, దారిమళ్లింపు

- రెడ్‌ అలర్ట్ జారీ

- చెట్టు పడి ఇద్దరు మృతి

ముంబయి : దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబయి భారీ వర్షాలతో అతలాకుతలమైంది. శనివారం నుంచి కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ నెల 6 వరకూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండి) రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఆదివారం కురిసిన భారీ వర్షాల కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గంటపాటు విమాన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. గంట పాటు రన్‌వే కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయడంతోపాటు, నాలుగు ఇండిగో విమానాలు రద్దు చేశారు. వివిధ విమానయాన సంస్థలకు చెందిన 13 విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. చెట్లు కూలిపోయిన ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం కుర్లా ప్రాంతంలో ఒక దుకాణంపై చెట్టు కూలిపోవడంతో 63 ఏళ్ల వ్యక్తి మరణించారు. కుర్లా వెస్ట్‌లోని నౌపాడ ప్రాంతంలో ఉన్న హిందీ బిఎంసి పాఠశాల సమీపంలో మధ్యాహ్నం 12:40 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని అధికారులు తెలిపారు. గోరేగావ్ లోని ఆరే కాలనీ ప్రాంతంలో మోటార్ సైకిల్‌ ‌పై వెళుతున్న 18 ఏళ్ల బాలుడిపై చెట్టు కొమ్మ పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. జూన్ 30న చెంబూర్‌లో పాఠశాల బస్సుపై చెట్టు కూలడంతో 11 ఏళ్ల బాలుడు మృతి చెందగా, పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. ఆదివారం వర్షాలకు కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినల్‌ (ఎల్‌‌టిటి) రైల్వే స్టేషన్‌ జలమయమైంది. ముంయిలో 24 గంటల వ్యవధిలో అనేక ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా, కొన్ని చోట్ల ఏకంగా 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలకు మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు సముద్ర తీరప్రాంతంలో నివసించే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్ (బిఎంసి) అధికారులు సూచించారు. సముద్రపు అలలు 4.19 మీటర్ల ఎత్తున ఎగసిపడే అవకాశం ఉందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

థానే, పూణేలలోనూ వర్షాలు

ఆదివారం ముంబయితో పాటు థానే, పూణేలలో వర్షాలు కురిసాయి. థానె, పాల్ఘడ్‌, నవీముంబయి, పుణె ప్రాంతాల్లో పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. మరికొన్ని చోట్ల రహదారులు నీట మునిగిపోయాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్న వారిని అధికారులు, సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. విక్రోలిలో అత్యధికంగా 31.06 వర్షపాతం నమోదైంది.

ముకేశ్ అంబానీ కాన్వాయ్‌ ఎదుట కూలిన వృక్షం

వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ భద్రతా కాన్వాయ్‌కి పెను ప్రమాదం తప్పింది. పశ్చిమ శివారులోని బంద్రా ప్రాంతంలో ఓ భారీ వృక్షం కాన్వాయ్‌ ఎదుట కూలిపోయింది. దీంతో కాసేపు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. అప్రమత్తమైన అధికారులు చెట్టును తొలగించి.. ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

దేశవ్యాప్తంగా విస్తృతంగా రుతుపనాలు

దేశవ్యాప్తంగా ఆదివారం రుతుపవన కార్యకలాపాలు తీవ్రమయ్యాయి. మహారాష్ర్టతో పాటు ఉత్తర్‌‌ప్రదేశ్‌, కేరళ, ఒడిషా, జార్ఖండ్‌, ఢిల్లీ, హిమాచల్‌‌ప్రదేశ్‌‌ల్లో విస్తారంగా కుండపోత వర్షం కురిసింది. ఒడిషాలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలను హై అలర్ట్‌లో ఉంచారు. ఈ వాయుగుండం రాబోయే రోజుల్లో చాంద్‌బలి, దిఘా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని, దీనివల్ల ఒడిషా, పశ్చిమ బెంగాల్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. ఆదివారం కేరళలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో పలు ప్రాంతాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. జార్ఖండ్‌లో 24 జిల్లాలోనూ ఈ నెల 6 నుండి 9 వరకు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం ఉత్తర ప్రదేశ్ లోనూ అక్కడక్కడా భారీ వర్షాలు కురిసాయి. ఆదివారం వర్షాలకు ఉన్నావ్ జిల్లాలో కాన్పూర్-లక్నో జాతీయ రహదారిని గంగా ఎక్స్‌ప్రెస్‌వేతో కలిపే రహదారిలోని కొంత భాగం, దాని కింద ఉన్న మట్టి కొట్టుకుపోవడంతో కుంగిపోయింది.

కుంగిపోయిన నూతన రహదారి

బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్‌‌లో రహదారి నిర్మించిన తరువాత కురిసిన తొలి వర్షాలకే రోడ్డు కుంగిపోయింది. సోనిక్ ప్రాంతంలోని బషీరత్‌గంజ్ సమీపంలో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు అనుసంధానమయ్యే లింక్ రోడ్డు దాదాపు ఏడు మీటర్ల మేర కుంగిపోవడంతో మరమ్మతు పనులు చేపట్టారు. ప్రమాణాలకు అనుగుణంగా రహదారి నిర్మాణం చేపట్టకపోవడంతోనే తొలి రుతుపవన వర్షానికే రోడ్డు కుంగిపోయిందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఐఎండి సమాచారం ప్రకారం ఆదివారం సాయంత్రం 5:30 గంటల వరకు ముజఫర్‌నగర్‌లో 9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రయాగ్‌రాజ్, వారణాసి విమానాశ్రయంలో చెరో 8.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. గురుగ్రామ్‌‌లో పలు ప్రాంతాలు జలమయమై, ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్