6న ఇసి కార్యాలయానికి ప్రతిపక్ష ఎంపిల మార్చ్
నవంబర్ 1న ఢిల్లీలో భారీ ర్యాలీ
రేపటి నుంచి 8వ తేది వరకు జిల్లాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ పాదయాత్రలు
సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న అన్ని ఎస్ఐఆర్ కేసులు త్వరగా పరిష్కరించాలి
ఇండియా బ్లాక్ సమావేశంలో నిర్ణయం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మోడీ ప్రభుత్వ కీలుబొమ్మగా వ్యవహరిస్తూ ఎన్నికల వ్యవస్థను దెబ్బతీస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనకు ఇండియా బ్లాక్ పిలుపునిచ్చింది. దీనిలోభాగంగా రేపటి (అక్టోబర్ 2, శుక్రవారం)నుండి ఎనిమిదవ తేది వరకు అన్ని జిల్లాల్లో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ (సేవ్ డెమోక్రసీ)’ పాదయాత్రలు నిర్వహించనున్నారు. ఆరవ తేది ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయానికి ప్రతిపక్ష ఎంపిలు సంయుక్త మార్చ్ చేపట్టనున్నారు. అక్టోబర్ రెండో వారంలో రాష్ట్రపతిని కలిసి 'ఓట్ల దొంగతనం'తో సహా పలు అంశాలపై చర్చించనున్నారు. కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో బుధవారం ఇండియా బ్లాక్ సమావేశం జరిగింది. 19 పార్టీల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మూడన్నర గంటల పాటు చర్చించి ఈ మేరకు కార్యాచరణను రూపొందించారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలపై అన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ‘ఓటు చోరీ’, ఎన్నికల వ్యవస్థపై చర్చించి, ప్రజాస్వామ్య పరిరక్షణకు కార్యాచరణ ప్రకటించారు. దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో ఐదు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని, నవంబర్ 1న ఢిల్లీలో భారీ ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీని నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణయించింది, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఎస్ఐఆర్, ఎన్నికల వ్యవహారాలకు సంబంధించిన అన్ని పిటిషన్లను సకాలంలో , సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు డిమాండ్ చేశారు. 2027లో ఐదు ప్రధాన రాష్ట్రాల్లో కీలక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఒక్క ఓటరుకు కూడా ఓటు హక్కు ఉల్లంఘనకు గురికాకుండా చూసేందుకు ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడాలని ఇండియా బ్లాక్ పిలుపునిచ్చింది. భవిష్యత్ ఎన్నికలకు ఎస్‌ఐఆర్‌కు ముందు ఉన్న ఓటర్ల జాబితాను ఉపయోగించాలని ఇండియా బ్లాక్ నేతలు డిమాండ్ చేశారు.
సిఇసి రాజీనామా చేయాల్సిందే : ఖర్గే
సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ఇవిఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లను వినియోగించాలని ఇండియా బ్లాక్ నేతలు డిమాండ్ చేశారని చెప్పారు. సిఇసి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) వల్ల దాదాపు 13.3 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కు కోల్పోయారని, ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతమని అన్నారు. ఈ ప్రక్రియను రద్దు చేసి పాత ఓటర్ల జాబితానే కొనసాగించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత స్థానంలో రహస్య విధానాన్ని అనుమతించబోమని అన్నారు. ‘ఒక్క వ్యక్తి-ఒక్క ఓటు-ఒక్క విలువ’ అనే ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రం బలహీనపడకూడదని పేర్కొన్నారు.
దేశం అసాధారణ పరిస్థితిని *ఎదుర్కొంటోంది : ఎంఎ బేబీ
ఈ సమావేశంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ప్రసంగిస్తూ దేశం ఒక అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంటోందని అన్నారు. ‘‘ఫాసిస్టు సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ నియంత్రణలో ఉన్న బిజెపిని ఒక సాధారణ రాజకీయ పార్టీగా పరిగణించకూడదు. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలు జ్ఞానేష్ కుమార్ సహాయంతో దేశంలోని మొత్తం ఎన్నికల వ్యవస్థను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. జ్ఞానేష్ కుమార్ జోక్యాలు ప్రజాస్వామ్యానికి హాని చేసేవిగా ఉన్నాయి.ఈ పరిస్థితిలో, చిన్న, పెద్ద సంస్థలు ఏకమై పెద్ద ఎత్తున ఆత్మరక్షణకు సిద్ధంగా ఉండాలి. రాజకీయ పార్టీలతో పాటు, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న సామాజిక, మానవ హక్కుల కార్యకర్తలు, కళాకారులు, మేధావుల మద్దతు కూడా కోరాలి. ఆందోళన కార్యక్రమాలను నియంత్రించ డానికి కేంద్రీకృత వ్యవస్థతో పాటు, పార్టీల మధ్య సమన్వయం కోసం ఒక సంయుక్త కమిటీని కూడా ఏర్పాటు చేయాలి. ప్రతిపక్ష నాయకులు రాష్ట్రపతిని కలిసి ఈ అంశాలతో సహా పలు విషయాలపై చర్చించాలి’ అని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థపై *దాడి జరుగుతోంది : రాహుల్ గాంధీ
భారత ప్రజాస్వమ్యాన్ని బతికించేందుకు ఇండియా బ్లాక్ నాయకులు వ్యక్తిగతంగా కట్టుబడి ఉన్నారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారికి శిక్ష పడేలా చూడాలని నాయకులందరూ కోరుకుంటున్నట్టు తెలిపారు. ‘వారు ఎంత పెద్ద వారైనా, ఎంత ఉన్నతిలోని ఉన్నవారైనా.. వారి కంటే దేశ ప్రజాస్వామ్యం గొప్పది’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి జరుగుతోందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తున్నారని ఇండియా బ్లాక్ నేతల సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసిన వారిని శిక్షించేలా పోరాడటం తమ వ్యక్తిగత బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలంతా రాజ్యాంగానికి సమష్టి రక్షకులుగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు.
ఐక్యపోరాటాలకు ప్రధమ ప్రాధాన్యత : మమతా బెనర్జీ
ఆత్మరక్షణ కోసం విస్తృత కూటమిని ఏర్పాటు చేయాలన్న ఎంఎ బేబీ వైఖరితో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐక్య పోరాటాలకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, తాను, తన పార్టీ ఎలాంటి అహం లేకుండా ఐక్య పోరాటాలకు అండగా నిలుస్తామని మమతా అన్నారు. కాంగ్రెస్ తదుపరి ప్రధానమంత్రి కావాలనుకుంటే, దానిని ఎవరూ వ్యతిరేకించరని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ఇప్పుడు అధికారం గురించిన చర్చలకు కాకుండా, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తోందని బదులిచ్చారు.
ఈ సమావేశంలో సోనియా గాంధీ, జైరాం రమేష్, కెసి వేణుగోపాల్ (కాంగ్రెస్), జాన్ బ్రిట్టాస్ (సిపిఎం), పి సందోష్ కుమార్ (సిపిఐ), దీపాంకర్ భట్టాచార్య, రవి రాయ్ (సిపిఐ ఎంఎల్), జోస్ కె మణి (కేరళ కాంగ్రెస్-ఎం), తేజస్వి యాదవ్ (ఆర్‌జెడి), హరేంద్ర సింగ్ మాలిక్ (సిపిఎస్‌పి-సి.పి), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పిడిపి), వైకో (ఎండిఎంకె), ఎన్.కె ప్రేమచంద్రన్ (ఆర్ఎస్‌పి), సాదిఖలీ షిహాబ్ తంగల్ (ముస్లిం లీగ్), తిరుమావళవన్ (విసికె), జి. దేవరాజన్ (ఫార్వర్డ్ బ్లాక్), అభిషేక్ బెనర్జీ, డెరిక్ ఒబ్రెయిన్ (తృణమూల్ కాంగ్రెస్), ఫ్రాన్సిస్ జార్జ్ (కేరళ కాంగ్రెస్ జోసెఫ్), సీనియర్ న్యాయవాది, స్వతంత్ర ఎంపి కపిల్ సిబల్ తదితరులు పాల్గొన్నారు. శివసేన (యుబిటి) నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే, జెఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ కూడా ఆన్‌లైన్‌లో సభను ఉద్దేశించి ప్రసంగించారు.








కామెంట్‌లు (0)