న్యూఢిల్లీ:
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను కేటాయించాలని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పునఃపరిశీలించాలంటూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. మూడు నెలల వ్యవధిలో పాఠశాలలకు అవసరమైన భూమిని సేకరించి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
నవోదయ విద్యాలయాల పథకం తమ రాష్ట్ర భాషా విధానానికి పూర్తి విరుద్ధమని తమిళనాడు ప్రభుత్వం కోర్టులో వాదించింది. ఈ పాఠశాలల ద్వారా హిందీని బలవంతంగా రుద్దేందుకు, తమిళం కంటే హిందీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ధర్మాసనానికి తెలిపింది.
అయితే, కేంద్ర ప్రభుత్వ విధానాల అమలును రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తిరస్కరించడానికి వీల్లేదని జస్టిస్ బి.వి. నాగరుత్న స్పష్టం చేశారు. భాషా పరమైన అంశాలపై కేంద్రంతో 'సహకార సమాఖ్య' (కోఆపరేటివ్ ఫెడరలిజం) స్ఫూర్తితో చర్చలు జరపాలని సూచించారు. నవోదయ విద్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు విరుద్ధం కాదని కూడా స్పష్టం చేశారు. మరోవైపు, ఈ పథకం తప్పనిసరి కాదని, కేంద్ర విధానాన్ని అమలు చేయాలని కోర్టు రాష్ట్రాన్ని నిర్బంధించలేదని తమిళనాడు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
దేశంలో ఒక్క నవోదయ విద్యాలయం కూడా లేని ఏకైక రాష్ట్రం తమిళనాడు మాత్రమే. హిందీ రుద్దింపుపై ఉన్న అభ్యంతరాల వల్లే రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచీ ఈ పథకాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 14కి వాయిదా పడింది.








కామెంట్‌లు (0)