- సుప్రీం కోర్టు సీరియస్
- తీర్పులు కాగితాలకే పరిమితం చేస్తారా అంటూ ఆగ్రహం
న్యూఢిల్లీ: రుతుక్రమ ఆరోగ్యాన్ని (నెలసరి పరిశుభ్రత) ప్రాథమిక హక్కులో భాగంగా గుర్తిస్తూ ఇచ్చిన తీర్పు అమలుపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్పందించకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం కోరినప్పటికీ ఇప్పటివరకు అవసరమైన వివరాలు అందించకపోవడంపై ప్రశ్నించింది. తదుపరి విచారణ నాటికి కూడా స్పందించకపోతే, ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించింది. ఇందుకు సంబంధించి డాక్టర్ జయ ఠాకుర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై జస్టిస్ జెబి పార్ధివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన ధర్మాసనం ఈ నెల 13న విచారించింది. నెలసరి ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక హక్కు తీర్పు కేవలం కాగితాలకే పరిమితం కాకూడదని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తుందని ధర్మాసనం గుర్తుచేసింది. రుతుక్రమ పరిశుభ్రత, ఆరోగ్యం కూడా ఈ హక్కులో భాగమని సుప్రీం కోర్టు ఇప్పటికే ప్రకటించిందని తెలిపింది. సెప్టెంబర్ 1న ఇచ్చిన ఆదేశాల్లో తీర్పులో ప్రస్తావించిన లోపాల్ని పరిశీలించి, వాటిపై తీసుకున్న చర్యల వివరాల్ని తదుపరి విచారణకు సమర్పించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించినట్లు బెంచ్ గుర్తుచేసింది. అయినా కేంద్రం కోరిన సమాచారం ఇవ్వకపోవడంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు తీర్పులో చెప్పిన అంశాలు కేవలం కాగితాలపైనే ఉంటే, ఈ ప్రాథమిక హక్కును కేంద్రం, రాష్ట్రాలు ఎలా అమలు చేస్తాయని ప్రశ్నించింది.
డిసెంబర్ 14 డెడ్లైన్
కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి- ఈ అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోందని, తీర్పు అమలు తీరుపై వివరాలు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్ని కోరినట్లు తెలిపారు. అయితే ఇప్పటివరకు స్పందన రాలేదని ఆమె కోర్టుకు వివరించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. కేంద్రం కోరినా రాష్ట్రాలు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ తీర్పు ప్రాముఖ్యతను గుర్తించాయని భావిస్తున్నట్లు తెలిపిన ధర్మాసనం.. ఆయా రాష్ట్రాలు తీసుకున్న చర్యలకు లిఖితపూర్వక వివరాలు సేకరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ సమయంలోనూ కొన్ని రాష్ట్రాలైనా స్పందించలేదని కేంద్రం చెబితే, సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించింది. చివరిసారిగా అవకాశం ఇస్తూ కేసు విచారణను డిసెంబర్ 14 కు వాయిదా వేసింది.
'మేం తీర్పులో చెప్పిన విషయాలు కేవలం కాగితాలకే పరిమితమైతే, కేంద్రం, రాష్ట్రాలు ఈ ప్రాథమిక హక్కును చిన్నారి బాలికలకు ఎలా అందిస్తాయి? సుదూర ప్రాంతాల్లో రుతుస్రావ పరిశుభ్రత సదుపాయాలు లేక చదువుకు దూరమవుతున్న వేలాది మంది బాలికల సంక్షేమం కోసం ఈ తీర్పు ఇచ్చామని గుర్తించాలి.' అని సుప్రీంకోర్టు తెలిపింది.
పాఠశాలల్లో బాలికల సమస్యలపై దృష్టి
రుతుక్రమ పరిశుభ్రత సమస్యల కారణంగా, సరైన సదుపాయాలు లేనందున ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని బాలికలు చదువును మధ్యలోనే మానేస్తున్నారని సుప్రీం కోర్టు పేర్కొంది. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడటమే తీర్పు ప్రధాన ఉద్దేశాల్లో ఒకటని తెలిపింది. సెప్టెంబర్ 1న ఇచ్చిన ఆదేశాల్లో పాఠశాలల్లో బాలురు, బాలికలకు వేర్వేరుగా ఉండే మరుగుదొడ్లు ఎన్ని ఉన్నాయనే దానితో పాటు, అవి సరిగా ఉన్నాయా లేదా అనే అంశంపై దృష్టి పెట్టాలని స్పష్టం చేసింది. ఇంకా మరుగుదొడ్లకు నీటి సౌకర్యం సరిగా ఉందా లేదా, బాలికలకు ప్రైవసీ, సులభంగా అక్కడికి చేరుకునే సౌకర్యాలు ఉన్నాయో లేదో పరిశీలించాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో బాలబాలికలకు విడివిడిగా నీటి సదుపాయం కలిగిన 30458 మరుగుదొడ్లను ఇప్పటికే నిర్మించామని కేంద్ర ప్రభుత్వం గతంలోనే అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసింది. ఇంకా 4236 మరుగుదొడ్ల నిర్మాణం తుది దశలో ఉందని పేర్కొంది. ఇక అంతకుముందు ఈ ఏడాది జనవరి 30న కీలక తీర్పులో కూడా సుప్రీం కోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు అన్నింట్లోనూ నీటి సౌకర్యంతో కూడిన, వేర్వేరు మరుగుదొడ్లు ఉండాలని స్పష్టం చేసింది. అలానే ప్రతి పాఠశాలలో బాలికలకు శానిటరీ న్యాప్కిన్లను ఉచితంగా అందించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. వీటి అమలు తీరుపైనే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వివరాలు కోరింది.








కామెంట్లు (0)