సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓటు హక్కును తీసివేసే ప్రక్రియను ఏ కోర్టూ సమర్థించదు..

22 గంటల క్రితం

bhutuya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 04:45 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

- భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఓటు హక్కు అంతర్భాగం

- ఓటున్న పౌరులు, లేని పౌరులు అని రాజ్యాంగం విభజించదు

- సుప్రీంకోర్టు జస్టిస్ భుయాన్ వ్యాఖ్యలు

- ఎన్నికల సంఘం తీరుపై జస్టిస్ నారీమన్ ఆందోళన

న్యూఢిల్లీ : దేశంలో ఓటు హక్కుపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ భుయాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఓటు హక్కును తొలగించే ఏ ప్రక్రియను న్యాయస్థానాలు సమర్థించవని భుయాన్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌) వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

జస్టిస్‌ ‌భుయాన్‌ ఏమన్నారంటే?

​ 19వ నల్సార్ జస్టిస్ బి.ఆర్. సావ్నీ స్మారక మూట్ కోర్టు పోటీ-2026 ముగింపు సభ ఆధివారం జరిగింది. దీనికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. భారత పౌరుడి ఓటు హక్కు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని ఆయన స్పష్టం చేశారు. లక్షలాది పౌరులను ఓటు హక్కుకు దూరం చేసే ఏ ప్రక్రియ అయినా మౌలికంగా ఏకపక్షమైనదేనని, అది రాజ్యాంగంలోని 14, 326 అధికరణలను ఉల్లంఘిస్తుందని అన్నారు.

​ఓటు హక్కు కేవలం చట్టబద్ధ హక్కు కాదని, వయోజన ఓటు హక్కుకు హామీ ఇచ్చే 326వ అధికరణం నుంచి ఉద్భవించిన రాజ్యాంగ హక్కు అని ఆయన వివరించారు. ఓటు హక్కున్న పౌరులు, లేని పౌరులు అనే రెండు వర్గాలను రాజ్యాంగం ఊహించలేదన్నారు. ‘‘లక్షలాది భారత పౌరులను ఓటు హక్కు లేని రెండో తరగతి పౌరులుగా మార్చే ఏ ప్రక్రియ అయినా మౌలికంగా ఏకపక్షమే. దానిని సమర్థించడానికి ఎన్ని పోలికలు చూపినా కుదరదు. అది రాజ్యాంగ హృదయాన్నే దెబ్బతీస్తుంది. మనం స్వీకరించిన రాజ్యాంగ క్రమాన్ని పూర్తిగా నిరాకరించడమేనని అనడానికి కూడా నేను వెనుకాడను’’ అని ఆయన పేర్కొన్నారు. జస్టిస్ భుయాన్ తన ప్రసంగంలో ఎన్నికల సంఘం (ఇసిఐ) చేపట్టిన ఎస్ఐఆర్‌ గురించి నేరుగా ప్రస్తావించలేదు. అయితే అర్హులైన ఓటర్లు జాబితాల నుంచి తొలగిచారనే ఆందోళనల ను ఆయన పరోక్షంగా వ్యక్తం చేశారు.

​ బిహార్, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ ను సవాలు చేసిన రిట్ పిటిషన్లపై సుప్రీంకోర్టు 2026 మే 27న తీర్పు ఇచ్చింది. ఎస్‌ఐఆర్ ప్రక్రియను, దానిని నిర్వహించే ఇసిఐ అధికారాన్ని ఆ తీర్పులో సమర్థించింది. పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా ఎస్‌ఐఆర్‌పై తాత్కాలిక స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ప్రక్రియ పూర్తై, బిహార్ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాతే తుది తీర్పు వెలువడింది.

ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు..

​ ఓటు హక్కు ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిందని జస్టిస్ భుయాన్ గుర్తు చేశారు. అయితే పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పు ప్రకారం, అది ఖచ్చితంగా రాజ్యాంగ హక్కేనని, 326వ అధికరణం నుంచే పుట్టిందని అన్నారు. ఈ హక్కు వినియోగాన్ని చట్టాల ద్వారా నియంత్రించవచ్చు కానీ, అవి 325, 326 అధికరణల పరిధిలోనే ఉండాలని ఆయన చెప్పారు. 326వ అధికరణం ప్రకారం 18 ఏళ్లు నిండిన వ్యక్తి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హుడు. నివాసం లేకపోవడం, మానసిక అస్వస్థత, నేరం, అవినీతి లేదా అక్రమ పద్ధతులు వంటి రాజ్యాంగం అనుమతించిన అనర్హతలు మాత్రమే మినహాయింపులు. "ఈ పరిధులను ఉల్లంఘించే ఏ చట్టమైనా చెల్లదు. పరిపాలనా చర్యలు కూడా ఓటు హక్కును అహేతుకంగా, అసమంజసంగా కుదించకుండా చూడాలి" అని ఆయన అన్నారు.

నోటీసు, వాదన వినకుండా పేర్ల తొలగింపు కుదరదు...

​ ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950 ప్రకారం, ఓటరుకు తన వాదన వినిపించే సహేతుక అవకాశం ఇచ్చిన తర్వాతే జాబితా నుంచి పేరు తొలగించాలని జస్టిస్ భుయాన్ గుర్తు చేశారు. లాల్ బాబు హుస్సేన్ వర్సెస్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కేసులో సుప్రీంకోర్టు పేర్ల తొలగింపునకు మార్గదర్శకాలు ఇచ్చిందని, నోటీసు జారీ చేయడం, విచారణ అవకాశం కల్పించడం అందులో ఉన్నాయని చెప్పారు. ‘‘మరణించిన ఓటరు విషయంలో తప్ప, ఒకసారి ఓటర్ల జాబితాలో నమోదైన పేరును నోటీసు, విచారణ లేకుండా తొలగించకూడదు’’ అని ఆయన అన్నారు. 2023 నాటి అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పును కూడా ప్రస్తావించారు. ఓటు హక్కును 326వ అధికరణం నుంచి వేరు చేయలేమని, ఓటరుగా ఉండే హక్కు స్వేచ్ఛాయుత, న్యాయమైన ఎన్నికలకు పునాది అని ఆ తీర్పు పేర్కొందని గుర్తు చేశారు.

ఇలా పనిచేసే ఎన్నికల సంఘం ఉండకూడదు : జస్టిస్ నారీమన్

​ మరోవైపు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్ ఎన్నికల సంఘం పనితీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉన్న రాజ్‌కుమార్ కాలేజీలో ‘‘రాజ్యాంగం – సామాన్యుడు’’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. ఎస్‌ఐఆర్ సమయంలో భారీగా ఓటర్లను జాబితాల నుంచి తొలగించారని, కొన్ని కీలక నిర్ణయాలను ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) మిగతా ఇద్దరు కమిషనర్ల అభ్యంతరాలను పట్టించుకోకుండా తీసుకున్నారన్న వార్తలు వచ్చాయని ఆయన అన్నారు. ‘‘ఇలా పనిచేసే, లేదా పనిచేయని ఎన్నికల సంఘం ఉండకూడదు’’ అని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లో 90 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగిపోవడం సుప్రీంకోర్టును ఎస్‌ఐఆర్‌ నిలిపివేసేంతగా కదిలించలేదని జస్టిస్ నారీమన్ విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని పూర్తిగా ప్రభుత్వ చేతుల్లో ఉంచడం ప్రమాద సంకేతమని జస్టిస్ నారీమన్ అన్నారు. 2023లో అనూప్ బరన్వాల్ కేసులో సుప్రీంకోర్టు తాత్కాలిక చర్యగా, ప్రధానమంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేత (లేదా అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేత), భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)తో కూడిన కమిటీ సిఇసిని నియమించాలని ఆదేశించిందని ఆయన గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం వెంటనే 2023లో కొత్త చట్టం తెచ్చి, కమిటీ నుంచి సిజెఐని తొలగించి, ప్రధాని నామినేట్ చేసే కేంద్ర కేబినెట్ మంత్రిని చేర్చిందని అన్నారు. సిఇసిను సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జి తరహాలోనే తొలగించగలిగేలా రక్షణ ఉందని, అయితే ‘‘నియామకం ప్రభుత్వ చేతుల్లో ఉంటే, తొలగింపు ప్రక్రియ వారి స్వాతంత్ర్యానికి, నిష్పాక్షికతకు పెద్దగా తోడ్పడదు’’ అని ఆయన అన్నారు. సిఇసి తీసుకున్న కొన్ని నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరం తెలిపారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనాన్ని జస్టిస్ నారీమన్ ప్రస్తావించారు. 2023 చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం మూడింట రెండు వంతుల మెజారిటీ నిర్ణయమే చెల్లుతుందని, అయినా వారు ఆ హక్కును ఎందుకు వినియోగించలేదని ప్రశ్నించారు. ‘‘వారు కూడా ప్రస్తుత ప్రభుత్వం నియమించిన వారే కాబట్టి అలా చేయలేదు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ఈ రోజు మన రాజ్యాంగం కింద సామాన్యుడికి, రాజ్యాంగ హృదయమైన, ప్రజాస్వామ్య హృదయమైన ఓటు హక్కుకు పెను ప్రమాదం పొంచి ఉంది’’ అని ఆయన హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్