- కేంద్ర మంత్రి సురేష్ గోపి వెల్లడి
న్యూఢిల్లీ : ప్రస్తుతమున్న 20శాతం స్థాయిని మించి పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్‌ను పెంచే విషయమై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం, ఖనిజవాయు శాఖ మంత్రి సురేష్ గోపి తెలిపారు. ఒకవేళ భవిష్యత్తులో ఈ స్థాయిని పెంచాలనుకుంటే ముందుగా శాస్త్రీయమైన అధ్యయనం జరిపి, పరిశ్రమలతో చర్చలు, సంప్రదింపులు చేసి నిర్ణయిస్తామని తెలిపారు. ఈ మేరకు సోమవారం రాజ్యసభలో రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఆటోమొబైల్ తయారీదారులు, చమురు మార్కెటింగ్ కంపెనీలు, పరిశోధనా సంస్థలతో సహా సంబంధిత పక్షాలతో చర్చలు, అలాగే సవివరమైన శాస్త్ర, సాంకేతిక అధ్యయనాలు పూర్తిచేసిన తర్వాత నిర్ణయం వుంటుందన్నారు. రెండు దశాబ్దాలకు పైగా దశలవారీ అమలు జరిగిన అనంతరం షెడ్యూల్ కన్నా ఐదేళ్ళు ముందుగానే భారత్, ఈ 20శాతం బ్లెండింగ్ స్థాయికి చేరుకుందని మంత్రి చెప్పారు. 2013-14లో సగటు బ్లెండింగ్ 1.53శాతంగా వుండగా, 2025-26లో 20శాతానికి చేరుకుందన్నారు. వాహన తయారీదారులు, ఆటోమొబైల్ అసోసియేషన్ల నుండి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని చెప్పారు. ఇంజన్ విఫలమైందని లేదా పెట్రోల్ పంపు ఇబ్బందులు, నీటి కలుషితం వంటి సమస్యల గురించి కూడా వినియోగదారుల సంఘాలు ఏమీ మాట్లాడలేదన్నారు. ఈ అమలు వల్ల 1.97లక్షల కోట్ల రూపాయిలకు పైగా ఆదా అయిందన్నారు. కాలుష్య ఉద్గారాలు కూడా 952లక్షల టన్నుల మేరా నివారించగలిగామన్నారు.








కామెంట్‌లు (0)