బుధవారం, 18 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మహిళలను మహిళా పోలీసులే అదుపు చేయాలన్న నిబంధన లేదు: ఢిల్లీ పోలీసులు

9 గంటల క్రితం

Delhi Police.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 03:04 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : జనసమూహాల నియంత్రణ చర్యల్లో మహిళలను మహిళా పోలీసు సిబ్బందే అదుపు చేయాలన్న తప్పనిసరి నిబంధన ఏదీ లేదని ఢిల్లీ పోలీసులు బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. మహిళా నిరసనకారులు, జర్నలిస్టుల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారన్న ఫిర్యాదులపై దాఖలైన పిటిషన్లకు సమాధానంగా ఢిల్లీ పోలీసులు అఫిడవిట్‌ సమర్పించారు. నిరసన ప్రదేశాల్లో మహిళా పోలీసులను మోహరించాలా వద్దా అనేది పరిస్థితులు, మర్యాదను పాటించాల్సిన అవసరం, ఘర్షణలు, ఉద్రిక్తతలను నివారించడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. జనసమూహాల నియంత్రణలో మహిళా సిబ్బందినే నియమించాలంటూ బీఎన్‌ఎస్‌ఎస్‌-2023లో ఎలాంటి చట్టబద్ధమైన ఆదేశాలు లేవని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేందుకు పురుష పోలీసులకు ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేవని, విధుల్లో ఉన్న మహిళా పోలీసులకు సహకరించకుండా వారిని నిలువరించలేమని తెలిపారు. ఇలాంటి నిర్ణయాలను క్షణాల్లో తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. జర్నలిస్టులు, న్యాయవాదులు, ఇతర నిపుణులు తమ వృత్తిపరమైన విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవద్దని అక్టోబరు 11న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు.. రీల్స్‌ రూపొందించేవారు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, నిషేధిత ప్రదేశాల్లో పోలీసుల చట్టబద్ధమైన ఆదేశాలను ఉల్లంఘించేవారికి వర్తించవని పోలీసులు పేర్కొన్నారు. జర్నలిస్టుల పట్ల తమకు పూర్తి గౌరవం ఉందని, అయితే కెమెరాలు, మైక్రోఫోన్లు పట్టుకుని జర్నలిస్టులుగా చెప్పుకొంటున్న కంటెంట్‌ క్రియేటర్లతో నిరసన ప్రదేశాలు నిండిపోతున్నాయని తెలిపారు. జర్నలిస్టులకు, రీల్స్‌ రూపొందించేవారికి మధ్య తేడాను గుర్తించడం కష్టమైనప్పటికీ, శాంతిభద్రతలకు, చట్టానికి ముప్పు కలిగించనంతవరకు కంటెంట్‌ క్రియేటర్లను అడ్డుకోవడం లేదని అఫిడవిట్‌లో వివరించారు. ప్రస్తుత చట్టాలు, నిబంధనల ప్రకారం రీల్స్‌ రూపొందించేవారు, ఇతర కంటెంట్‌ క్రియేటర్లను విధుల్లో ఉన్న జర్నలిస్టులుగా పరిగణించడం లేదని, వారికి జర్నలిస్టులు లేదా రిపోర్టర్ల స్థాయి కల్పించాలా అనే అంశం ఇంకా తేలాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో స్పష్టమైన నిబంధనలు లేకపోవడం శాంతిభద్రతల పరిరక్షణలో ఇబ్బందులు సృష్టిస్తోందని తెలిపారు. నిరసనల సందర్భంగా కార్యకలాపాల ప్రాంతాలకు సహేతుకమైన దూరం పాటించాలన్న ఆదేశాలను కెమెరాలు, మైక్రోఫోన్లు ఉన్న కొందరు ఉల్లంఘించినప్పటికీ పోలీసులు సంయమనం పాటించారని చెప్పారు. విధుల్లో ఉన్న పాత్రికేయులను అడ్డుకోవడం లేదా నిర్బంధించడం తమ ఉద్దేశం కాదని, పొరపాటున అదుపులోకి తీసుకున్నవారిని గుర్తింపు ధ్రువీకరించిన వెంటనే విడుదల చేశామని తెలిపారు. అక్రమ నిరసన ప్రదేశాల నుంచి ఆందోళనకారులను చెదరగొట్టి, శాంతిభద్రతలను పునరుద్ధరించడమే తమ చర్యల ఉద్దేశమని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. చట్టబద్ధంగా విధులు నిర్వర్తిస్తున్న మీడియా సిబ్బందిని నిరోధించడం, నిర్బంధించడం లేదా వారి పనికి ఆటంకం కలిగించడం తమ లక్ష్యం కాదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్