మంగళవారం, 03 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఒమన్‌ తీరంలో భారత నౌకకి ప్రమాదం.. నావికుడు మృతి

10 గంటల క్రితం

Oman coast
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 01:03 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఒమన్‌ తీరం సమీపంలో అనుమానాస్పద వస్తువును ఢీకొని భారతీయ నౌక ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒక నావికుడు మరణించగా, మిగిలిన 13 మంది సిబ్బందిని ఒమన్‌ కోస్ట్‌గార్డ్‌ సురక్షితంగా రక్షించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ మంగళవారం వెల్లడించారు.

వివరాల ప్రకారం.. సోమవారం 14 మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న భారత నౌక ఎంఎస్‌వీ అల్‌ జుసుఫీ, ఒమన్‌ తీరానికి సమీపంలో గుర్తుతెలియని వస్తువును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుజరాత్‌కు చెందిన గంధర్‌ నహీమ్‌ అజీజ్‌ అనే నావికుడు మరణించారు. మిగిలిన 13 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడగా, వారిని ఒమన్‌ కోస్ట్‌గార్డ్‌ రక్షించింది. రక్షించబడిన 13 మంది సిబ్బందికి తక్షణ సహాయం అందించడంతోపాటు, మరణించిన నావికుడి మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి కేంద్ర మంత్రిత్వ శాఖ, ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాయని సోనోవాల్‌ తెలిపారు. మరోవైపు అక్టోబర్‌ 30న మార్షల్‌ దీవుల జెండాతో ప్రయాణిస్తున్న ఎం/టి అల్‌ మయేదా అనే ఎల్‌ఎన్‌జీ నౌక పర్షియన్‌ గల్ఫ్‌లో క్షిపణి దాడికి గురైంది. ఈ నౌకలో ఆరుగురు భారతీయ నావికులతో సహా మొత్తం 25 మంది సిబ్బంది ఉన్నారు. వారందరూ సురక్షితంగా ఉన్నట్లు సోనోవాల్‌ తెలిపారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణల నేపథ్యంలో ప్రభావిత జలాల్లో పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రతపై తాజా ఘటన మరోసారి ఆందోళనలను పెంచింది.

ఇటీవల జి20 విదేశాంగ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్‌. జయశంకర్‌ పౌర నౌకాయానం, నావికులపై జరుగుతున్న వరుస దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ జలాల్లో నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల ప్రభావాలను గ్లోబల్‌ సౌత్‌ దేశాలు అసమానంగా భరిస్తున్నాయని పేర్కొన్నారు. పౌర నౌకాయానంపై దాడులు ఇంధనం, ఆహారం, ఎరువుల సరఫరా, ధరలకు ముప్పుగా పరిణమిస్తున్నాయని జయశంకర్‌ హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్