న్యూఢిల్లీ : బహిరంగ ప్రదర్శనలు, నిరసనలకు తగిన మార్గదర్శకాలు, ప్రామాణిక కార్యాచరణ విధానం రూపొందించాలంటూ దాఖలైన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు గురువారం అంగీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, సిజెపి నేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు నోటీసులు జారీచేసింది. న్యాయవాదుల సంఘం తరపున సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ హాజరయ్యారు.
ప్రజా నిరసననకు పిలుపునిచ్చిన నిర్వాహకులు, పాల్గొనేవారి బాధ్యతలను నిర్వచించే సమగ్ర, ఏకరీతి, ప్రభావవంతమైన మార్గదర్శకాలను రూపొందించాలని కోరుతూ 'లాయర్స్ వాయిస్' దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. భిన్నాభిప్రాయాలు ప్రజాస్వామ్యంలో భాగమే అయినప్పటికీ, నిరసనలు చట్టపరమైన పరిధిలోనే ఉండాలి, రాజధానిని స్తంభింపజేయడం, న్యాయవాదుల జీవనోపాధికి అంతరాయం కలిగించడం వంటివి చేయకూడదని పిటిషన్ పేర్కొంది. వర్తించే చట్టం, చట్టబద్ధమైన ఆంక్షలు లేదా సమర్థ అధికారుల చెల్లుబాటు అయ్యే ఆదేశాలను ఉల్లంఘించి నిర్వహించే ప్రజా నిరసనలను అడ్డుకునేందుకు, సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేసేందుకు సకాలంలో, సమన్వయ చర్యలు తీసుకునేలా ఒక ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (ఎస్ఒపి) సమీక్షించి, సవరించి, రూపొందించి, అమలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ తగిన రిట్, ఉత్తర్వు లేదా ఆదేశం జారీ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)