గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉపాధ్యాయులపై ‘రాజకీయ’ నిషేదం

2 గంటల క్రితం

Suvendu-Adhikari.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 07:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి సువేందు ప్రకటన

కొల్‌‌కతా : పశ్చిమ బెంగాల్‌‌లోని డబుల్‌ ఇంజిన్‌ ‌బిజెపి ప్రభుత్వం ఉపాధ్యాయుల హక్కులను కాలరాస్తూ దుర్మార్గమైన నిర్ణయం తీసుకుంది. స్కూలు సర్వీస్‌ ‌కమిషన్‌ (ఎస్‌ఎస్‌‌సి) ద్వారా కొత్తగా నియమితులైన పాఠశాల ఉపాధ్యాయులు ఇకపై రాజకీయాల్లో పాల్గొనడంపై నిషేదం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి గురువారం నాడు కీలక ప్రకటన చేశారు. అలాగే పంచాయతీ, మున్సిపాలిటీ, అసెంబ్లీ, లోక్‌సభ సహా ఏ ఎన్నికలలోనూ పోటీ చేయడానికి అర్హులు కారని తెలిపారు. అంతేకాకుండా ఎలాంటి క్రియాశీల రాజకీయ పదవిని చేపట్టరాదని పేర్కొన్నారు. ఈ నిబంధన కొత్తగా నియమితులైన పాఠశాల ఉపాధ్యాయులందరికీ వర్తిస్తుందని, ప్రస్తుతం సర్వీసులో ఉంటూ రాజకీయాల్లో కొనసాగుతున్న ఉపాధ్యాయులకు వర్తించదని తెలిపారు. రాష్ట్ర సచివాలయం (నబన్నా)లో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ఈ మేరకు ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యాఖ్యానించారు. అయితే దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే పశ్చిమ బెంగాల్‌‌కు ఒక విశిష్టత ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ఉపాధ్యాయులది కీలక పాత్ర. ఆ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ప్రఫుల్ల చంద్ర ఘోష్ నుంచి ప్రస్తుత పాఠశాల విద్యాశాఖ మంత్రి దీపక్ బర్మన్ వరకు చాలా మంది దిగ్గజ రాజకీయ నాయకులు ఉపాధ్యాయ నేపథ్యమున్నవారే. సత్యసాధన్ చక్రవర్తి, అంజన్ బేరా వంటి విద్యావేత్తలు వామపక్ష పార్టీల తరఫున కేంద్ర రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. అదే విధంగా జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, సింగూర్‌లో మాస్టర్‌ మోషాయ్ (పాఠశాల ఉపాధ్యాయుడు)గా సుపరిచితుడైన రవీంద్రనాథ్ భట్టాచార్య, విద్యావేత్తగా ఉండి నాటక రచయితగా మారిన బ్రత్య బసు కూడా రాజకీయ రంగంలో ప్రముఖ వ్యక్తులుగా ఎదిగారు. ఇప్పుడు ఏకంగా ఉపాధ్యాయులు రాజకీయాల్లో పాల్గొనరాదంటూ బిజెపి ప్రభుత్వం నిర్ణయించడం రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని నిపుణులు విమర్శిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్