బుధవారం, 22 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నిరసనకారుడికి పెల్లెట్ గన్ గాయాలు

17 గంటల క్రితం

delhi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 09:01 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- షాక్ బ్యాటన్‌ల వాడకంపై విమర్శలు

న్యూఢిల్లీ: ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ నిరసనలో పాల్గొన్న పౌరులపై భద్రతా దళాలు పెల్లెట్ గన్‌లు, షాక్ బ్యాటన్‌లను ఉపయోగించారని నిరసనకారులు తెలిపారు. పోలీసు చర్యలో గాయపడిన నిరసనకారుల్లో ఒకరికి పెల్లెట్ గన్ గాయాలైనట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో పౌరులపై భద్రతా దళాలు పెల్లెట్ గన్‌లు, షాక్ బ్యాటన్‌లు ఉపయోగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే ఈ వార్తలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. 'బొద్దింకల జనతా పార్టీ' పిలుపు మేరకు సోమవారం పార్లమెంటుకు జరిగిన మార్చ్ సందర్భంగా పోలీసుల చర్యలో గాయపడిన 80 మంది నిరసనకారులలో ఒకరికి పెల్లెట్ గన్ గాయాలయ్యాయని, బాధితుడు లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. నిరసనకారుడి స్నేహితుడు షేక్ ఇర్షాద్ మన్సూరి(25) ది హిందూ పత్రికతో మాట్లాడుతూ, కన్నాట్ ప్లేస్‌లోని పాలికా బజార్ సమీపంలో యూనిఫాంలో ఉన్న రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) జవాన్ ఒకరు మన్సూరిని కొట్టారని చెప్పారు. ఒక మహిళ షాక్ బ్యాటన్‌తో కొట్టబడి షాక్‌కు గురవుతున్న వీడియో కూడా మంగళవారం వెలుగులోకి వచ్చింది. స్వల్ప విద్యుత్ షాక్‌ను వెలువరించే షాక్ బ్యాటన్‌లను ఢిల్లీలో ఉపయోగించడం ఇదే మొదటిసారి.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సోమవారం జంతర్ మంతర్ వద్ద, దాని పరిసర ప్రాంతాల్లో జరిగిన నిరసన సందర్భంగా ఢిల్లీ పోలీసులతో పాటు మోహరించిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్ఫైఎఫ్) ఆధ్వర్యంలోని అల్లర్ల నిరోధక విభాగమైన ఆర్ఏఎఫ్ పరికరాల్లో పెల్లెట్ గన్‌లు, షాక్ బ్యాటన్‌లు కూడా ఉన్నాయి.

సీజేపీకి చెందిన సౌరవ్ దాస్ ఎక్స్‌లో షేర్ చేసిన మన్సూరి గాయాలను చూపించే వీడియోపై సీఆర్పీఎఫ్ స్పందించలేదు. అయితే, న్యూఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ "శాంతియుత నిరసనకారులపై పోలీసు బలగాలు పెల్లెట్ గన్‌లను ఉపయోగిస్తున్నాయని వస్తున్న నివేదికలు పూర్తిగా అవాస్తవమైనవి. తప్పుదోవ పట్టించేవి. ధృవీకరించని సమాచారాన్ని షేర్ చేయవద్దని లేదా ప్రచారం చేయవద్దని సూచిస్తున్నాం. ఏ సమాచారాన్నైనా పోస్ట్ చేసే లేదా ఫార్వార్డ్ చేసే ముందు అధికారిక వర్గాల నుంచి వాస్తవాలను ధృవీకరించుకోవాలి" అని తెలిపారు.

దూరం నుంచి కాల్చినప్పుడు చర్మంలోకి చొచ్చుకుపోయే పెల్లెట్లను చివరిసారిగా 2024లో పంజాబ్–హర్యానా సరిహద్దులోని ఖనౌరి, శంభు వద్ద రైతుల నిరసన సందర్భంగా ఉపయోగించినట్లు తెలిసింది. అప్పటికీ పోలీసులు పెల్లెట్ గన్‌ల వాడకాన్ని ఖండించినప్పటికీ, పలువురు గాయపడ్డారని రైతు నాయకులు ఆగ్రహించారు.

2023లో జాతి ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్‌లో నిరసనకారులపై కూడా ఈ తుపాకులను ఉపయోగించడంతో తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమైంది. అంతకుముందు 2016లో జమ్మూ-కాశ్మీర్ అశాంతి సమయంలో పెల్లెట్ గన్‌ల వాడకం వల్ల అనేక మంది పాక్షికంగా లేదా పూర్తిగా అంధులయ్యారు.

ఈ ఘటనలో గాయపడిన మన్సూరికి శరీరం పైభాగంలో ఇరుక్కుపోయిన పెల్లెట్లను తొలగించేందుకు శస్త్రచికిత్స నిర్వహించారు. "శస్త్రచికిత్స విజయవంతమైంది. కళ్ల కింద ఉన్న పెల్లెట్లను తొలగించాం. అయితే మెడలో రక్తనాళానికి సమీపంలో ఉన్న ఒక పెల్లెట్‌ను తొలగించలేకపోయాం. దానిని తొలగించేందుకు మరో శస్త్రచికిత్స అవసరం కావచ్చు" అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం, మంగళవారం సాయంత్రానికి గాయపడిన వారి సంఖ్య 83కు చేరింది. వీరిలో పౌరులు, పోలీసు అధికారులు ఇద్దరూ ఉన్నారు. కంటికి గాయమైన మరో నిరసనకారుడిని ఎయిమ్స్‌కు తరలించగా, 15 ఏళ్ల బాలుడిని కలావతి శరణ్ చిన్నారుల ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన 21 ఏళ్ల సాక్షి అనే మహిళ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతోంది. కాగా, కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పీ. నడ్డా మంగళవారం ఆసుపత్రిని సందర్శించి గాయపడిన మన్సూరిని పరామర్శించారు. విద్యా వ్యవస్థలోని సమస్యల కారణంగానే తాను నిరసనలో పాల్గొన్నట్లు మన్సూరి ఆయనకు తెలిపినట్లు బాధితుడి స్నేహితుడు వెల్లడించాడు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్