Rajasthan మున్సిపల్ ఫలితాల్లో కొత్త రాజకీయ సంకేతాలు
జైపూర్ : రాజస్థాన్‌లో తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలను సూచిస్తున్నాయి. బిజెపి కి ప్రధాన ప్రత్యర్థిగా నిలవడంలో కాంగ్రెస్ విఫలమవుతున్న పరిస్థితుల్లో, కొన్ని ప్రాంతాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), సిపిఐ(ఎం) ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులుగా ముందుకొస్తున్నాయి. బారన్, నోఖా మున్సిపల్ సంస్థల ఫలితాలు ఈ ధోరణిని స్పష్టం చేస్తున్నాయి.
బారన్ జిల్లాలోని బారన్ మున్సిపల్ కౌన్సిల్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ సాధించింది. మొత్తం 60 వార్డులకు గాను ఆప్ 31 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 18, బిజెపి 9, స్వతంత్రులు రెండు స్థానాల్లో విజయం సాధించారు. దీంతో కౌన్సిల్ అధ్యక్ష పదవిని కూడా ఆప్ దక్కించుకునే అవకాశం ఏర్పడింది. రాజస్థాన్‌లో ఇప్పటివరకు ఆప్‌కు ఎన్నికల పరంగా పరిమిత ప్రాబల్యం ఉన్న నేపథ్యంలో బారన్ ఫలితం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్, బిజెపి లను వెనక్కి నెట్టి ఒక మున్సిపల్ కౌన్సిల్‌లో మెజారిటీ సాధించడం ద్వారా రాష్ట్ర స్థానిక రాజకీయాల్లో ఆప్ తనకు ఒక స్థానం ఏర్పరుచుకుంది. ఫలితాల అనంతరం ఆప్ కార్యకర్తలు పలు వార్డుల్లో విజయోత్సవాలు నిర్వహించారు.
నోఖాలో సిపిఐ(ఎం)కు ఆధిపత్యం ...
బికనీర్ జిల్లాలోని నోఖా నగర పాలిక ఎన్నికల్లో సిపిఐ(ఎం) ఘన విజయం సాధించింది. మొత్తం 45 వార్డులకు గాను సిపిఐ(ఎం) 29 స్థానాలను గెలుచుకుంది. బిజెపి 13, స్వతంత్రులు మూడు వార్డులను దక్కించుకున్నారు. కాంగ్రెస్ ఒక్క వార్డులో కూడా విజయం సాధించలేకపోయింది. దీంతో మున్సిపల్ బోర్డును ఏర్పాటు చేసేందుకు సిపిఐ(ఎం)కు అవసరమైన సంఖ్యాబలం లభించింది.
స్థానిక పౌర సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, బిజెపి విధానాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఈ విజయానికి కారణమని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కిషన్ పారిఖ్ పేర్కొన్నారు. స్థానిక సమస్యలపై పార్టీ సాగించిన పోరాటాలను ప్రజలు గుర్తించి సిపిఐ(ఎం)ను బలమైన ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారని తెలిపారు. ఆర్థిక సమస్యలపై పోరాటంతోపాటు మత రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడగల పార్టీ సిపిఐ(ఎం) మాత్రమేనని ఆయన అన్నారు. బిజెపి పై ప్రజల్లో అసంతృప్తి ఉండగా, కాంగ్రెస్ రాజకీయంగా బలహీనపడటంతో రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ప్రజలు సిపిఐ(ఎం)ను ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారని స్పష్టం చేశారు.
సుమారు 40 మంది విజయం
ఈ మున్సిపల్ ఎన్నికల్లో రాజస్థాన్ వ్యాప్తంగా సిపిఐ(ఎం) 192 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. వారిలో సుమారు 40 మంది విజయం సాధించారు. ఒకటి, రెండు వార్డుల్లో సాధించే విజయాలు కూడా పార్టీకి కీలకమేనని కిషన్ పారిఖ్ తెలిపారు. స్థానిక సంస్థల్లోకి ప్రవేశించడం ద్వారా ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు సాగిస్తూ దీర్ఘకాలిక రాజకీయ ఉనికిని నిర్మించుకోవచ్చని అన్నారు. రాజస్థాన్‌లో సిపిఐ(ఎం) ఎన్నికల బలం పరిమితంగానే ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో పార్టీ తన రాజకీయ ప్రాసంగికతను కొనసాగిస్తూ విస్తరిస్తున్న ధోరణి కనిపిస్తోంది. నోఖా ఫలితం దీనికి మరో ఉదాహరణగా నిలిచింది.
లోక్‌సభలోనూ బలం ...
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి భాగస్వామిగా సిపిఐ(ఎం) అభ్యర్థి అమ్రా రామ్ సికార్ నుంచి విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో రాజస్థాన్‌లో ఒక్క లోక్‌సభ సీటు కూడా గెలుచుకోలేని కాంగ్రెస్, 2024లో కూటమి భాగస్వాముల కోసం మూడు స్థానాలను కేటాయించింది. సికార్‌ను సిపిఐ(ఎం)కు, నాగౌర్‌ను ఆర్‌ఎల్‌పీకి, బన్స్వారాను భారత్ ఆదివాసీ పార్టీకి కేటాయించింది. ఈ మూడు స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు.
2025 ఏప్రిల్‌లో అమ్రా రామ్ సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరోలో చేరిన తొలి రాజస్థానీగా గుర్తింపు పొందారు. మొత్తంగా తాజా మున్సిపల్ ఫలితాలు రాజస్థాన్‌లో కాంగ్రెస్ రాజకీయ స్థానం క్షీణిస్తుండగా, కొన్ని ప్రాంతాల్లో ఆప్, సిపిఐ(ఎం)లు బిజెపి కి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులుగా ఎదుగుతున్న సంకేతాలను ఇస్తున్నాయి.








కామెంట్‌లు (0)