జార్ఖండ్ : పర్యావరణ పరిరక్షణను ఒక పండుగలా మారుస్తూ ఝార్ఖండ్ అటవీ శాఖ 'సేవ్ ట్రీ' ప్రచారాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో దాదాపు 3 లక్షల చెట్లకు రాఖీలు కట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (PCCF) సంజీవ్ కుమార్ తెలిపారు. శుక్రవారం గుమ్లా జిల్లాలోని జోరాడ్ గ్రామంలో చెట్టుకు రాఖీ కట్టడం ద్వారా ఆయన ఈ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సంజీవ్ కుమార్ మాట్లాడుతూ .... రక్షా బంధన్ అంటే అక్కాచెల్లెళ్లను రక్షిస్తామని సోదరులు ప్రామిస్ చేసే పండుగ. అలాగే మన జీవిత ఆధారమైన పర్యావరణాన్ని రక్షించుకోవడం కూడా మన అందరి బాధ్యత అని సంజీవ్ కుమార్ వెల్లడించారు. ప్రజలను ప్రకృతికి మానసికంగా దగ్గర చేయడం, చెట్లను నరకకుండా కాపాడుతామని ప్రమాణం చేయించడం ఈ ప్రచారపు ముఖ్య ఉద్దేశం అని అన్నారు. రక్షా బంధన్ రోజున 700 గ్రామాల్లో 1 లక్ష చెట్లకు, నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మొత్తం 3 లక్షల చెట్లకు రాఖీలు కట్టనున్నారు.
ఈ కార్యక్రమం సంజీవ్ కుమార్ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చింది. 2004లో ధన్‌బాద్ జిల్లాలోని తుండి బ్లాక్‌కు చెందిన, ఒకప్పుడు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతమైన 'లుకయ్యా' గ్రామంలో ఇది మొదలైంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 12,000 కంటే ఎక్కువ గ్రామాలు ఈ ప్రోగ్రామ్‌తో అనుసంధానమయ్యాయి. లుకయ్యా గ్రామంలో ఈ చొరవ ద్వారా 20,000 కంటే ఎక్కువ మహువా చెట్లను కాపాడారు. ఈ చెట్ల వల్ల ఇప్పుడు గ్రామస్తులకు అటవీ ఉత్పత్తుల ద్వారా ఆర్థికంగా ఎంతో ఊరట లభిస్తోంది. ఈ ప్రచారం వల్ల జార్ఖండ్‌లో అడవుల శాతం పెరగడమే కాకుండా నీటి సంరక్షణకు కూడా ఎంతగానో ఉపయోగపడింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (FSI) నివేదికల ప్రకారం ... 2001 నుండి గత రెండు దశాబ్దాల్లో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 1,128 చదరపు కిలోమీటర్లు పెరిగింది. FSI 2023 నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 23,765.78 చదరపు కిలోమీటర్లు (మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 29.76%) అటవీ ప్రాంతం ఉంది. 2001లో ఇది 22,637 చ.కి.మీ మాత్రమే ఉండేది. ఇటీవల జరిగిన 77వ 'వన మహోత్సవ్'లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాట్లాడుతూ .... పర్యావరణ పరిరక్షణ అనేది అందరి ఉమ్మడి బాధ్యత అని, కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని పెంచి కాపాడేలా అటవీ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు.








కామెంట్‌లు (0)