- ఢిల్లీ కేంద్రంగా ఓటర్ల డేటాబేస్ ఎందుకు?
న్యూఢిల్లీ : ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్) పై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌లోనే ఈ విషయమై తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నట్లు వెల్లడైంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై తిరుగుబాటు స్థాయిలో చోటుచేసుకున్న ఈ పరిణామాలపై ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ (న్యూఢిల్లీ) బుధవారం నాడు ప్రచురించిన పరిశోధనాత్మక కథనం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపింది. సిఇసిపై చర్యలు తీసుకోవాలని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి, ఈ కథనం ప్రకారం ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్‌లో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత పది నెలల్లో కనీసం 14 సందర్భాల్లో తమ అభ్యంతరాలను నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలు, జారీ చేసిన ఆదేశాలపై అధికారికంగానే వారు తప్పుపట్టారు దేశ వ్యాప్తంగా ఆందోళనలకు కారణమైన కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల పేర్ల తొలగింపు, ఓటర్ల డేటాబేస్ నిర్వహణ, ఎన్నికల సాఫ్ట్‌వేర్ తదితర అంశాలపైనే ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం. తమకు సమాచారం ఇవ్వకుండా లేదా తమ ఆమోదం లేకుండా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు ఇద్దరు కమిషనర్లు రికార్డుల్లో పేర్కొన్నారు. బీహార్‌లో 2025 జూన్‌లో ప్రారంభమైన ఎస్‌ఐఆర్ ప్రక్రియను అనంతరం 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించారు. ఈ ప్రక్రియలో 13 కోట్లకు పైగా పేర్లు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాల నుంచి తొలగించారని. ఈ ప్రక్రియలో భాగంగా పేర్ల చేర్పు, తొలగింపు, పునరుద్ధరణకు సంబంధించిన నిర్ణయాలపై కమిషన్‌లోని ఇద్దరు సభ్యులు వరుసగా అభ్యంతరాలు నమోదు చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.
ఫారం 6లో మార్పుపై అభ్యంతరం
కొత్తగా ఓటరుగా నమోదు కావడానికి ఉపయోగించే ఫారం 6లో చేసిన మార్పు పై కూడా ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు తెలిపారు.
ఈ ఏడాది జూలైలో ఫారం 6లో కొత్త ప్రశ్నను ఎన్నికల కమిషన్ చేర్చింది. కొత్త ఓటరు లేదా వారి తల్లిదండ్రులు, తాతముత్తాతల పేర్లు గత ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితాలో ఉన్నాయా అనే వివరాలను అందులో అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా దరఖాస్తును ముందుకు తీసుకెళ్లే అవకాశం లేకుండా చేసింది. ఈ మార్పుపై ఎన్నికల కమిషనర్ వివేక్ జోషి మే నెలలోనే ఫైల్లో అభ్యంతరం వ్యక్తం చేశారు.
సంబంధిత నిబంధనలను సవరించకుండా ఫారం 6లో ఇలాంటి మార్పు చేయడానికి వీలుందా అనే అంశాన్ని ఆయన ప్రశ్నించారు. మరో కమిషనర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు కూడా దీనితో ఏకీభవించినట్లు కథనం పేర్కొంది. అయితే, వీరి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండానే ఆ మార్పును అమలులోకి తీసుకువచ్చారు. అనంతరం ఆగస్టు 13న సంధు ఈ మార్పును “అనధికారికం, చట్టవిరుద్ధం”గా పేర్కొని వెంటనే దానిని తొలగించాలని రికార్డులో సూచించారు.
ఢిల్లీ కేంద్రంగా ఓటర్ల డేటాబేస్ ఎందుకు?
ఓటర్ల జాబితా డేటాబేస్‌కు ఎవరు యాక్సెస్ పొందాలి అన్న అంశంపైనా ఇద్దరు కమిషనర్లు ప్రశ్నలు లేవనెత్తారు. ప్రతి నియోజకవర్గానికి చెందిన ఓటర్ల జాబితాను సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి నిర్వహిస్తారు. ఈ వ్యవస్థపై రాష్ట్ర స్థాయి చట్టబద్ధ అధికారులకు పూర్తి స్థాయి యాక్సెస్ ఉందా అన్న అంశాన్ని వివేక్ జోషి మేలో ప్రశ్నించారు. ఓటర్ల డేటాబేస్ క్రమంగా ఢిల్లీ కేంద్రంగా కేంద్రీకృతమవుతోందని ఆయన పేర్కొన్నారు. సంబంధిత చట్టబద్ధ అధికారులకు తప్ప మరెవరికీ ఓటర్ల డేటాబేస్‌లో మార్పులు చేసే అవకాశం లేకుండా ఆడిట్ నిర్వహించాలని ఆయన సూచించినట్లు వెల్లడించింది. ఆగస్టులో సుఖ్‌బీర్ సింగ్ సంధు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర స్థాయి ఎన్నికల అధికారులు డేటాబేస్ లో తమకు పూర్తి స్థాయి యాక్సెస్ లేదని చెబుతున్నారని ఆయన రికార్డులో పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ అప్పీళ్లపై ప్రశ్నలు
పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అప్పీళ్ల వ్యవహారం పై కూడా సంధు అభ్యంతరాలు తెలిపారు.
ఎస్‌ఐఆర్‌లో “లాజికల్ డిస్క్రెపెన్సీస్” ఉన్నట్లు గుర్తించిన సుమారు 60 లక్షల మంది ఓటర్ల అంశాన్ని 2026 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయాధికారుల పరిశీలనకు అప్పగించింది. అనంతరం 27 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.
తొలగింపులపై అప్పీళ్లను విచారించేందుకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులతో ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సెప్టెంబరు మధ్యలో ట్రిబ్యునళ్ల వద్ద 38 లక్షల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నట్లు ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు తెలిపింది. వీటిలో 22.21 లక్షల అప్పీళ్లు తొలగింపునకు గురైన ఓటర్లు తమ పేర్లను తిరిగి చేర్చాలని దాఖలు చేసినవి. మరో 16.10 లక్షల అప్పీళ్లు చేర్చిన ఓటర్ల పేర్లను తొలగించాలని కోరుతూ దాఖలైనవి. ఈ 16.10 లక్షల అప్పీళ్లను ఎవరు దాఖలు చేశారన్న అంశాన్ని సుఖ్‌బీర్ సింగ్ సంధు ప్రశ్నించినట్లు కథనం తెలిపింది. ఎన్నికల కమిషన్ తరఫున ఈ అప్పీళ్లను దాఖలు చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారని, వాటిని వాస్తవంగా ఎవరు దాఖలు చేశారనే వివరాలను తెలపాలని ఆయన కోరారు. ఈ ప్రక్రియకు సంబంధించిన సమాచారం తనకు, వివేక్ జోషికి, పశ్చిమ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు అందలేదని సంధు రికార్డులో పేర్కొన్నారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తాజా కథనంలో పేర్కొంది. గోవా లో జరిగిన ఎస్‌ఐఆర్ పై కూడా ప్రశ్నలు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పలు ప్రశ్నలు వేశారు.
కమిషన్ సమాచారంపైనా అభ్యంతరాలు
ఎన్నికల కమిషన్ పేరుతో వెలువడే అధికారిక సమాచారానికి పూర్తి కమిషన్ ఆమోదం ఉందా అన్న అంశాన్ని కూడా ఇద్దరు కమిషనర్లు ప్రశ్నించినట్లు కథనం తెలిపింది. ఏప్రిల్ 16న సుఖ్‌బీర్ సింగ్ సంధు సీనియర్ అధికారులకు పంపిన సమాచారంలో కమిషన్ పేరుతో అనేక కమ్యూనికేషన్లు వెలువడుతున్నప్పటికీ వాటికి కమిషన్ ఆమోదం లేదని చెప్పారు. ఎనిమిది రోజుల తర్వాత వివేక్ జోషి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కమిషన్ పేరుతో వెలువడే అన్ని కమ్యూనికేషన్లకు అవసరమైన ఆమోదం ఉండాలని ఆయన చెప్పారు.
కథనం తెలిపింది.
క్యాబినెట్ కార్యదర్శికి ఇద్దరు కమిషనర్ల లేఖ
ఓటర్ల జాబితాల నిర్వహణకు సంబంధించిన ఐటి వ్యవస్థపై అధికారుల బాధ్యతల విభజనలో మార్పుల అంశాన్ని కూడా ఇద్దరు కమిషనర్లు ప్రశ్నించారు. ఈ మార్పుల వల్ల ఓటర్ల డేటాబేస్ నిర్వహణపై ఉన్న పర్యవేక్షణలో ఒక స్థాయి తొలగిపోయిందని వారు అభిప్రాయపడినట్లు కథనం తెలిపింది. ఈ మార్పులు తమకు తెలియకుండా జరిగాయని పేర్కొంటూ సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి విడివిడిగా కేంద్ర క్యాబినెట్ కార్యదర్శికి లేఖలు రాసినట్లు తాజా కథనంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది.
మా ఆమోదమూ అవసరమే!
ఎన్నికల కమిషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కింద పనిచేసే రాజ్యాంగ సంస్థ. 2023లో అమల్లోకి వచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టంలోని 18వ సెక్షన్ ప్రకారం కమిషన్ వ్యవహారాలు సాధ్యమైనంతవరకు ఏకగ్రీవంగా నిర్వహించాలి. కమిషనర్ల మధ్య అభిప్రాయభేదం ఏర్పడితే మెజారిటీ అభిప్రాయం ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చు. కమిషన్ తన పని విధానం, బాధ్యతల విభజనను ఏకగ్రీవ నిర్ణయంతో చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను ప్రస్తావిస్తూ ఇద్దరు కమిషనర్లు కమిషన్ తీసుకునే నిర్ణయాలకు, వెలువరించే సమాచారానికి పూర్తి కమిషన్ ఆమోదం అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఇతర కమిషనర్లతో సమావేశమైనారు. ఇది నాలుగు నెలల తరువాత జరిగిన భేటీ!
అవి ఏకగ్రీవ నిర్ణయాలే..! ఇసి వివరణ
గత ఏడాది కాలంలో తీసుకున్న అన్ని నిర్ణయాలు పూర్తి కమిషన్ తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాలేనని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కమిషన్‌లోని సభ్యులు, అధికారులు తమ సూచనలు, అభిప్రాయాలు, పరిశీలనలు వ్యక్తం చేయడం ఏ సంస్థలోనైనా జరిగే సాధారణ నిర్ణయ ప్రక్రియలో భాగమేనని పేర్కొంది గత ఏడాది కాలంలో ఎన్నికల కమిషన్ సుమారు 40 కొత్త కార్యక్రమాలు, అనేక ఎన్నికల సంస్కరణలు చేపట్టిందని ఓటర్ల జాబితాల సవరణ, ఎస్‌ఐఆర్ సహా పలు నిర్ణయాలు వీటిలో ఉన్నాయని ఇసి తెలిపింది.








కామెంట్‌లు (0)