- భాస్కరాచార్య కళాశాలలో ఎస్ఎఫ్ఐ జయకేతనం
ప్రజాశక్తి–న్యూఢిల్లీ బ్యూరో : సంఘ్ పరివార్ అనుబంధ విద్యార్థి సంఘం ఎబివిపి గుప్పిట్లో దశాబ్దాలుగా ఉంటూ వచ్చిన ఢిల్లీ విశ్వవిద్యాలయం (డియు) అనుబంధ కళాశాలల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. దశాబ్దాలుగా కాషాయ కంచుకోటగా పేరొందిన భాస్కరాచార్య కాలేజీ ఆఫ్ అప్లైడ్ సైన్స్‌లో భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) జయకేతనం ఎగురవేసి చరిత్ర సృష్టించింది. ఇక్కడ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్చీ బిశ్వాస్ తన సమీప ప్రత్యర్థి అయిన ఎబివిపి అభ్యర్థిపై 25 ఓట్ల ఆధిక్యంతో గెలిచి అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. హోరాహోరీగా సాగిన పోరులో ఆర్చీ బిశ్వాస్ 372 ఓట్లు, ఎబివిపి అభ్యర్థికి 347 ఓట్లు వచ్చాయి. ఆర్ఎస్ఎస్ అనుబంధ ఉపాధ్యాయ, బోధనేతర ఉద్యోగ సంఘాలు బలంగా ఉన్న ఈ కళాశాలలో ఎస్ఎఫ్ఐ విజయం సాధించడం విశేషం. ఈ కళాశాల ప్రిన్సిపల్ గతంలో ఎబివిపి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన వ్యక్తి కావడం గమనార్హం. జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, కౌన్సిలర్ పదవులను ఎన్ఎస్‌యుఐ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఈ కళాశాలలో ఎబివిపి ఒక్క పదవీ దక్కించుకోలేకపోయింది. అయితే డియు అనుబంధంగా ఉన్న పలు కాలేజీలను ఎప్పటిలాగే ఎబివిపి నిలిబెట్టుకుంది. కానీ గతంతో పోలీస్తే ఈ సారి అంత సులువుగా అది నెగ్గలేకపోయింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాలేజీ, కేశవ్ మహావిద్యాలయ, అదితి మహావిద్యాలయ, శ్రీఅరబిందో కాలేజీ, భారతి కాలేజీ, శివాజీ కాలేజీ, రాంజాస్ కాలేజీలో కీలక పదవులను ఎబివిపి చేజిక్కించుకుంది. అయితే అటు కేంద్రంలోనూ, ఇటు ఢిల్లీలోనూ బిజెపి అధికారంలోకి ఉండటం, అధికార యంత్రాంగాన్ని మొత్తం తమ కనుసన్నల్లో ఉంచుకొని ఈ ఎన్నికల్లో ఎబివిపి అన్ని విధాల ప్రలోభాలకు, అక్రమాలకు పాల్పడిందన్న విమర్శలొస్తున్నాయి. కాషాయ మూకలు ఎన్ని విధాల ప్రతిబంధకాలు సృష్టించినా..ఈ దఫా విద్యార్థి సంఘం ఎన్నికల్లో మాత్రం ఎస్‌ఎఫ్‌ఐ నేతృత్వ విద్యార్థి సంఘాల ఐక్య వేదిక సత్తా చాటడం విశేషం.
జాకిర్ హుస్సేన్‌లో ఎస్ఎఫ్ఐ పట్టు
జాకిర్ హుస్సేన్ కళాశాలలో జాయింట్ సెక్రటరీ పదవిని ఎస్ఎఫ్ఐ అభ్యర్థి జితేంద్రకుమార్ గెలుచుకున్నారు. అధ్యక్ష పదవిలో ఎబివిపి తిరుగుబాటు అభ్యర్థి విజయం సాధించగా, సెక్రటరీ పదవిని ఎన్ఎస్‌యుఐ తిరుగుబాటు అభ్యర్థి కైవసం చేసుకున్నారు.
హాన్స్‌రాజ్ కాలేజీలో సత్తా
తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన హాన్స్‌రాజ్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ .. ఎబివిపికి గట్టి పోటీ ఇచ్చింది. వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసిన ఎస్ఎఫ్ఐ అభ్యర్థి శ్రిజన్ కశ్యప్ సుమారు 1,100 ఓట్లు సాధించారు. ఎబివిపి అభ్యర్థికి 1,400 ఓట్లు వచ్చాయి.
సౌత్ క్యాంపస్‌లో సంపూర్ణ విజయం
ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో ఎస్ఎఫ్ఐ మద్దతు ఇచ్చిన ప్యానల్ అన్ని స్థానాల్లో విజయం సాధించింది. ఇతర కళాశాలల్లో ఎబివిపి ఆధిక్యంలో ఉన్నప్పటికీ, పలు చోట్ల ఎస్ఎఫ్ఐ పోటీని గట్టిగా నిలబెట్టింది. ఈవెనింగ్ కళాశాలల ఫలితాలు అర్ధరాత్రి వరకు వెలువడే అవకాశం ఉందని సమాచారం. మిరాండా హౌస్ సహా మరికొన్ని కళాశాలల్లో ఎస్ఎఫ్ఐ విజయం సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. కాగా ఢిల్లీ యూనివర్సిటీ కేంద్ర విద్యార్థి సంఘం ప్యానల్ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి.








కామెంట్‌లు (0)