న్యూఢిల్లీ : మాజీ ఆర్‌జెడి నేత, జన సూరజ్ మద్దతుదారుడు దులార్ చంద్ యాదవ్ హత్యకేసులో బహిష్కృత జెడి(యు) ఎమ్మెల్యే అనంత్‌సింగ్‌కు జారీ అయిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆయనను డిసెంబర్ 1లోగా అధికారుల ఎదుట లొంగిపోవాలని జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తును నాలుగు నెలల్లోగా పూర్తి చేయాలని బీహార్ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ నిమిత్తం కేసును నాలుగు నెలలకు వాయిదా వేసింది. నిందితుడు అనంత్‌సింగ్‌కు మార్చి 19న పాట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను మృతుని కుటుంబసభ్యుడు నీరజ్ కుమార్ సవాలు చేశారు. సింగ్‌కు బెయిల్ మంజూరు చేసే సమయంలో అతని నేర చరిత్ర, పలు క్రిమినల్ కేసుల్లో అతని ప్రమేయం వంటి అంశాలను తగినంతగా పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అనంత్‌సింగ్ నేర చరిత్రపై పిటిషనర్ తరఫు న్యాయవాది ఆందోళన వ్యక్తం చేయడంతో, బెయిల్ ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గతంలో నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే.
కేసు వివరాలు
ఈ కేసు అక్టోబర్ 30, 2025న బీహార్ అసెంబ్లీఎన్నికల ప్రచార సమయంలో మోకామాలో దులార్ చంద్ యాదవ్ హత్యకు సంబంధించినది. మాజీ ఆర్‌జెడి నేత దులార్ యాదవ్, 'జన్ సురాజ్ పార్టీ' అభ్యర్థి పియూష్ ప్రియదర్శికి మద్దతు ఇస్తుండగా, ప్రత్యర్థి అభ్యర్థుల మద్దతుదారుల మధ్య హింస చెలరేగింది. ఘర్షణ సమయంలో దులార్ యాదవ్‌ను ఒక ఎస్‌యువి ఢీకొట్టినట్లు సమాచారం. అయితే అతనిపై మొదట కాల్పులు జరిపి, తర్వాత వాహనంతో ఢీకొట్టారని మృతుని కుటుంబసభ్యులు వాదించారు. బలమైన వస్తువు గుండె, ఊపిరితిత్తులకు తగలడంతో అతను మృతిచెందినట్లు పోస్ట్‌మార్టమ్ నివేదిక సైతం నిర్థారించింది. ఈ కేసులో అనంత్‌సింగ్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ, 2025 నవంబర్ 1న అరెస్టు చేశారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పటికీ, ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మొకామా స్థానం నుంచి గెలుపొందారు. ఈ ఏడాది మార్చిలో పాట్నా హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై జెడి(యు) అక్టోబర్ 24న అనంత్‌సింగ్, అతని భార్య, మాజీ ఎమ్మెల్యే నీలం దేవిలను ఆరేళ్లపాటు బహిష్కరించింది. ఇటీవల జరిగిన బీహార్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనంతసింగ్ తమ ఆదేశాలను ధిక్కరించి, తమ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేశారని పార్టీ వెల్లడించింది. రాజ్యాంగంలోని ఫిరాయింపుల నిరోధక నిబంధనల కింద అతని అసెంబ్లీ సభ్యత్వంపై కూడా చర్యలు తీసుకోవాలని కోరింది.








కామెంట్‌లు (0)