ఇండియా బ్లాక్ ఆధ్వర్యంలో అభిశంసన
జ్ఞానేష్ కుమార్‌పై ఆరు అభియోగాలు చేసిన ఖర్గే
ఓటు హక్కును హరించిన వారిని వదిలిపెట్టం: రాహుల్ గాంధీ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్‌పై దేశద్రోహం కేసు నమోదు చేసి విచారణ జరపాలని రాజ్యసభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఇండియా బ్లాక్ ఆధ్వర్యంలో శనివారం నాడిక్కడ ఖర్గే నివాసంలో ప్రతీకాత్మక ప్రజా అభిశంసన కార్యక్రమం నిర్వహించారు. లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఎన్నికల ప్రక్రియను దెబ్బతీయడం, ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడటం, ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరచడం వంటి ఆరు అభియోగాలను ఖర్గే చదివి వినిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదేశాల మేరకు జ్ఞానేష్ కుమార్ ఎన్నికల కమిషన్‌ను నడుపుతున్నారని ఆయన అన్నారు. ఎన్నికల అక్రమాలకు సహకరించడం ద్వారా రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీశారని, దేశ, రాష్ట్రాల ఎన్నికలను ప్రభావితం చేసే కుట్రలో భాగస్వామిగా వ్యవహరించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సోనియాగాంధీ, సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ, ఆర్‌జెడి నేత తేజస్వీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
జ్ఞానేష్ కుమార్‌పై ఖర్గే చేసిన వినిపించిన ఆరు అభియోగాల్లో ప్రధానంగా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే కుట్రకు సహకరించడం, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో 13.3 కోట్ల మంది ఓటర్లను ఉద్దేశపూర్వకంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించడం ఉన్నాయి. పార్లమెంటు ఆమోదం లేకుండా ఓటరు నమోదు నిబంధనల్లోని ఫారం-6ను మార్చడం, ఇఆర్‌ఓనెట్/ఇసిఐనెట్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఓటర్ల జాబితాపై కేంద్రీకృత నియంత్రణ సాధించడం కూడా అభియోగాలుగా పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌లోని మిగిలిన ఇద్దరు కమిషనర్లను నిర్ణయాల ప్రక్రియకు దూరంగా ఉంచడం, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగ బాధ్యతను విస్మరించి అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించడం మిగిలిన అభియోగాలుగా ఉన్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తున్నారు..
దేశ ప్రజల ఓటు హక్కును హరించి, ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఎస్‌ఐఆర్ పేరుతో కోట్లాది మంది ఓటర్ల హక్కులను తొలగిస్తున్నారని విమర్శించారు. ప్రజలే తమ బలమని, దేశ భవిష్యత్తు కోసం అందరం కలిసి పోరాడుతున్నామని అన్నారు. పరిస్థితులు మారుతున్నాయని, ప్రజల గొంతుకను వినిపించే కొత్త రాజకీయ అస్త్రం సిద్ధమవుతోందని హెచ్చరించారు. ఓటర్ల జాబితాల నుంచి 13.3 కోట్ల మంది పేర్లను తొలగించారని రాహుల్ గాంధీ వివరించారు. ఇది మొత్తం ఓటర్లలో సుమారు 15 శాతానికి సమానమని అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో వీరంతా ఓటు హక్కును వినియోగించుకున్నారని, అప్పటి గెలుపు ఓటముల మధ్య తేడా కేవలం మూడు శాతమేనని గుర్తుచేశారు.
ఓటు హక్కును నిరూపించుకోవడానికి ఎంపికే రెండు విచారణలా? : జాన్ బ్రిట్టాస్
దేశంలో కోట్లాది మంది ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్ తన నైతిక, చట్టపరమైన అధికారాన్ని కోల్పోయారని సిపిఎం రాజ్యసభ సభ్యులు జాన్ బ్రిట్టాస్ విమర్శించారు. తాను అర్హతగల ఓటరునని నిరూపించుకోవడానికి ఒక ఎంపిగా తానే రెండు విచారణలను ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇక సామాన్య పౌరుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. సిఇసి జ్ఞానేష్ కుమార్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి సిపిఎం తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఓటర్ల జాబితాల నుంచి పేర్ల తొలగింపు ద్వారా ప్రజలను తమ ఓటు హక్కుకు దూరం చేస్తున్నారని విమర్శించారు.
సమాజ్‌వాదీ పార్టీ ఎంపి రాజీవ్ రాయ్ మాట్లాడుతూ ఓట్ల దొంగతనం వ్యవస్థీకృత నేరంగా మారిందన్నారు. చట్టంలో మార్పులు చేసి జ్ఞానేష్ కుమార్‌ను ఈ వ్యవస్థకు సూత్రధారిగా మార్చారని ఆరోపించారు. టిఎంసి ఎంపి మహువా మొయిత్రా మాట్లాడుతూ జ్ఞానేష్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని క్రమపద్ధతిలో నిర్వీర్యం చేశారని విమర్శించారు. పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలను బయట చర్చించాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. శివసేన ఎంపి అరవింద్ సావంత్, ఎన్‌సిపి ఎంపి బజరంగ్ మనోహర్ సోనావానే, ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి జి. దేవరాజన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, భారత గణతంత్రాన్ని పరిరక్షించాలంటే జ్ఞానేష్ కుమార్‌ను సిఇసి పదవి నుంచి తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపి కపిల్ సిబల్,జెఎంఎం ఎంపి బైద్యనాథ్ రామ్, ఆర్‌టిఐ కార్యకర్త అంజలి భరద్వాజ్, స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్, విసికె ఎంపి తిరుమావళవన్ ,ఐయుఎంఎల్ ఎంపి ఈటి మహ్మద్ బషీర్, నేషనల్ కాన్ఫెరెన్స్ నేత నాసిర్ అస్లాం,సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ ఎంపి సుదామా ప్రసాద్ , కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు జోస్ కె.మణి, సిపిఐ ఎంపి పి.సంతోష్ కుమార్‌లు మాట్లాడుతూ ఈ అభిశంసనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలాగే, విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగించబడిన బాధితులు కూడా తమ అనుభవాలను వివరించారు. అనంతరం ఈ అభిశంసన తీర్మానాన్ని ఎకగ్రీవంగా ఆమోదించారు.








కామెంట్‌లు (0)