- ఏడుగురు మృతి
బీర్భూమ్: పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తారాపీఠ్ ఆలయ పట్టణంలోని నాలుగు అంతస్తుల హోటల్‌లో మంటలు చెలరేగడంతో ఏడుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం సుమారు 5 గంటల సమయంలో ఎక్కువ మంది అతిథులు నిద్రలో ఉన్నా హోటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించిందని కొందరు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారిని రాంపూర్‌హాట్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తొలుత ఐదుగురు మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించగా.. అనంతరం మృతుల సంఖ్య ఏడుకు చేరినట్లు పోలీసులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్లు హోటల్ యాజమాన్యం పేర్కొంది. అయితే ప్రమాదానికి అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
"అకస్మాత్తుగా హోటల్ మొత్తం పొగతో నిండిపోయింది. మాకు ఊపిరి ఆడలేదు, తప్పించుకునే దారి కనుక్కోవడం చాలా కష్టమైంది" అని ఈ అగ్నిప్రమాదం నుండి తప్పించుకున్న కోల్‌కతాకు చెందిన ఒక మహిళ హోటల్ లోపల నెలకొన్న భయాందోళనను గుర్తుచేసుకున్నారు.








కామెంట్‌లు (0)