- విహార యాత్రకు వెళ్లారంటూ ప్రచారం
- బెంగళూరులో ఉన్మాది ఘాతుకం
బెంగళూరు : భారత సిలికాన్‌వ్యాలీగా పేరొందిన కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ ఉన్మాది తన భార్య సహా ఏడుగురిని అతి కిరాతకంగా హత్య చేశాడు. రెండు రోజుల వ్యవధిలో రోకలితో దాడి చేసి ఒకరి తర్వాత ఒకరిని హతమార్చిన అనంతరం, మృతదేహాలను వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సదరు ఉన్మాది తన భార్య, ఆమె కుటుంబ సభ్యులంతా కలిసి విహార యాత్రగా వెళ్లినట్టుగా ప్రచారం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు, హత్యలకు దారితీసిన కారణాలు, ఇతరుల ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, స్థానికులు శుక్రవారం నాడు వెల్లడించిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని శ్రీరాంపుర ప్రాంతానికి చెందిన శేఖర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సుమారు 20 ఏళ్ల క్రితం సునీతతో అతడికి వివాహమైంది. అయితే, సునీత తరచూ తన పుట్టింటికి వెళ్లడాన్ని శేఖర్ వ్యతిరేకించేవాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని దంపతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ, వారి మధ్య విభేదాలు మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో సునీతకు ఆమె తల్లి, సోదరులు అండగా నిలిచేవారు. ఇది శేఖర్‌కు మరింత ఆగ్రహం కలిగించేది. తన భార్యకు మద్దతుగా నిలుస్తున్న ఆమె కుటుంబ సభ్యులపై అతడు కక్ష పెంచుకున్నాడు. చివరకు వారందరినీ అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం శేఖర్ మొదట తన భార్య సునీతను రోకలితో కొట్టి హత్య చేశాడని ప్రాథమిక విచారణలో తెలిసింది. అనంతరం ఆమె మృతదేహాన్ని ఓ వస్త్రంలో చుట్టి కారులో తీసుకెళ్లి, నంది హిల్స్ సమీపంలో దాన్ని పడేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య విషయం బయటకు రాకుండా ఉండేందుకు సునీత మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేశాడని అన్నారు. భార్య కనిపించకుండా పోయిన విషయంపై ఎవరూ అనుమానించకుండా ఉండేందుకు, ఆమె ఎక్కడికో యాత్రకు వెళ్లిందని పొరుగువారికి చెప్పాడని వెల్లడించారు.
విందుకు పిలిచి..
సునీతను హత్య చేసిన మరుసటి రోజు శేఖర్ మరో దారుణానికి పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. తన బావమరుదులైన శివకుమార్, శంకర్లను విందు కోసం ఇంటికి ఆహ్వానించాడని అన్నారు. అనంతరం వారితో కలిసి మద్యం సేవించి, ఇద్దరినీ రోకలితో కొట్టి హత్య చేసినట్లు తెలిపారు. అంతటితో ఆగకుండా వారి కుటుంబ సభ్యులపైనా దాడి చేశాడని అన్నారు. శివకుమార్ భార్య దివ్య, శంకర్ భార్య నళినితో పాటు తన అత్త రూపవతిని కూడా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శివకుమార్ ఏడేళ్ల కుమారుడు పునీత్‌ను సైతం విడిచిపెట్టకుండా హతమార్చినట్లు తెలిపారు. ఇలా తన భార్యతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని శేఖర్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ వరుస హత్యలు వెంటనే వెలుగులోకి రాలేదని పోలీసులు తెలిపారు. నళిని తల్లి గురువారం శ్రీరాంపుర పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశారని అన్నారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారని చెప్పారు. నళిని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో అనుమానాలు వ్యక్తమయ్యాయని, దర్యాప్తును మరింత లోతుగా కొనసాగించగా, శేఖర్ చేసిన వరుస హత్యల విషయం బయటపడినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో లభించిన ఆధారాల ఆధారంగా శేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అనంతరం అతడిని అరెస్టు చేశారని అన్నారు.
అయితే హత్యల అనంతరం ఆధారాలు దొరకకుండా చేసేందుకు శేఖర్ ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారని చెప్పారు. ఇంట్లో పడిన రక్తపు మరకలను తొలగించేందుకు రసాయనాలను ఉపయోగించినట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాలను తరలించడానికి ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్న కారును, హత్యలకు ఉపయోగించిన రోకలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని అన్నారు. నంది హిల్స్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారని తెలపారు. ఈ క్రమంలో ఏడేళ్ల బాలుడు పునీత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మిగిలిన మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు.
కుటుంబ కలహాల కారణంగా తాను తీవ్ర మనోవేదనకు గురయ్యానని శేఖర్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే, ఈ హత్యలకు పాల్పడటంలో శేఖర్‌కు ఎవరైనా సహకరించారా? అనే అంశంపైనా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటనలో అతడి కుమార్తె పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలోనూ విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నివాస ప్రాంతంలో ఉన్న ఇంట్లో ఇంతటి దారుణాలు జరిగినప్పటికీ, అవి వెంటనే బయటకు రాకపోవడానికి గల కారణాలపై పోలీసులు పరిశీలిస్తున్నారని అన్నారు.







కామెంట్లు (0)