రామేశ్వరం : అంతర్జాతీయ జలాల్లో అక్రమంగా చేపల వేటకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఏడుగురు తమిళ మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం అదుపులోకి తీసుకుంది. వారి చేపల వేట ట్రాలర్‌ను కూడా స్వాధీనం చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున కచ్చతీవు ద్వీపం, మన్నార్ ఉత్తర ప్రాంతాల మధ్య చేపల వేట సాగిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
తమిళనాడు మత్స్యశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం 398 టోకెన్లు జారీ చేయగా, వాటి ఆధారంగా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. ఆదివారం సాయంత్రం వారు తిరిగి తీరానికి చేరుకోవాల్సి ఉంది. అయితే వారిలో ఏడుగురిని శ్రీలంక నౌకాదళం అదుపులోకి తీసుకుంది. అదుపులోకి తీసుకున్న వారిని ప్లేసియస్ (41), అలగు పాండి (22), ఆంటోనీ పిచ్చై (33), రాబిన్ (21), నెల్సన్ (58), అరులానంద జేవియర్ (65), సహాయ ఆనంద్ (34)గా అధికారులు గుర్తించారు. వీరంతా తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన రామేశ్వరం, తంగచ్చిమడం ప్రాంతాల వాసులని తెలిపారు.
ఈ ఘటనను మత్స్యకార సంఘం తీవ్రంగా ఖండించింది. అదుపులోకి తీసుకున్న మత్స్యకారులను, స్వాధీనం చేసుకున్న పడవను వీలైనంత త్వరగా విడిపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరింది.








కామెంట్‌లు (0)